విమానం 3,500 అడుగుల ఎత్తులో ఉండగా బుల్లెట్ తాకి గాయపడిన ప్రయాణికుడు!

2022-10-02 13:36:13.0

విమానం గాల్లో ప్రయాణిస్తుండగా హటాత్తుగా విమానంలోకి ఓ బుల్లెట్ దూసుక రావడంతో ప్రయాణీకుడు గాయపడ్డాడు. మయన్మార్ లో ఈ స‍ంఘటన జరిగింది.

 విమానం 3,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ బుల్లెట్ దూసుకొచ్చి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు గాయపడ్డాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన ఈ రోజు మయన్మార్ లో జరిగింది.

బ్రిటిష్ వార్తా సంస్థ ది సన్ ఇచ్చిన వివరాల ప్రకారం,మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి ఉత్తరాన నాలుగు మైళ్ల దూరంలో ఎగురుతోంది. ఆ సమయంలో భూమిపై నుండి కాల్చిన బుల్లెట్ విమానంలోకి దూసుకొచ్చి ఓ ప్రయాణీకుడికి తగిలింది. మయన్మార్‌లోని లోయికావ్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన తర్వాత, లోయికావ్‌లోని మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ కార్యాలయం నగరానికి వెళ్లే అన్ని విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.

కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు విమానంపై కాల్పులు జరిపినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తిరుగుబాటు గ్రూపులు ఈ ఆరోపణలను ఖండించాయి.

ఈ సంఘటనపై మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్, రాష్ట్ర టెలివిజన్ MRTV తో మాట్లాడుతూ, ప్రభుత్వంతో పోరాడుతున్న మైనారిటీ జాతి మిలీషియా అయిన కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన “ఉగ్రవాదులు” కాల్పులు జరిపారని చెప్పారు. ఈ బృందం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్, సాయుధ ప్రజాస్వామ్య అనుకూల సమూహంలోని తమ మిత్రులతో కలిసి ఈ పనిచేశారని ఆయన తెలిపారు.

“ప్రయాణికుల విమానంపై ఈ రకమైన దాడి యుద్ధ నేరం. శాంతి కోరుకునే వ్యక్తులు, సంస్థలు ఈ సంఘటనను ఖండించాలి” అని అతను ఫోన్ ద్వారా MRTV కి చెప్పాడు.

Passenger,onboard,Myanmar Airlines,flight,injured,bullet,mid-air