వెనక్కి రా ఫీనిక్స్

2023-01-03 04:05:38.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/03/433674-tribute.webp

వింజామరలు వీయించుకుంటున్నావా

విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా

ఇక్కడ చేరలేని తీరాలు

ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???

పోలవరం నిర్వాసితుల ని-వేదనలు

కాలసర్పాల నిర్హేతుక

ని-వేదికలూ నిర్వాకాలు

నీ నిర్భీతి వ్యాఖ్యానాల

నీ నిబద్ధ నీతి వాక్యాల

నిగళాలలో ఘల్లుమంటునే ఉన్నాయ్…

అబ్భ … ఏముంది బాస్ … అని

నువ్వు అన్ని ఫీలింగ్స్ నీ మేళవించి

అబ్బురపడే అవ్యయాలు

నా అంతరంగంలో ఆడుతునే ఉన్నాయ్

ఆ బక్కోడి లవ్ స్టోరీ

వాడి గవర్మెంటాఫీసర్ మామ పిటాంబర్

డాంబికం

ఫ్యాన్ ఒంటి మీద పడి నడుం విరిగిన ఇంటిఓనర్ ఆ పీల కాయుడి మీద కక్ష కట్టిన తీరు …

నువ్వు ఆ కథ పంపినప్పుడు

తెరలు తెరలు గా వచ్చిన నవ్వుతోనూ …

నువ్వు లేవనే చేదునిజం తెలిసినప్పుడు

అంతులేని వేదనతో

పొరలు పొరలుగా కట్టిన కన్నీటి

చారికలతోనూ…

నీ కలం లో కదలాడిన

కవితా పరిచారికలతోనూ

నీ మనో బలం లో మెదలాడిన

యారొగెంట్ అభిసారికలతోనూ

నీ పెక్కడిల్లోస్

ఇంకా మెమరీస్ లో ఫ్రెష్ గానే ఉన్నాయ్ …

మియర్ మేల్, మేల్ కొలుపు

మ్యూజిక్ నెవర్ డైస్ … ఇవన్నీ …

నేనూ నీ అంతటి కవినయ్యుంటే

ఒక యాభయ్యేళ్ళకో, డెబ్భయ్యేళ్ళకో

తెలుగు వాచకం ఉంటే …

అందులో నా కవిత్వం అచ్చైతే…

కవి కాలాదుల్లో నన్నూ

నీ సమకాలికుడిగా రాసి

నీ వైభవాన్ని … ఆ పక్కనే

నా ప్రాభవాన్నీ … పిల్లలు కీర్తించే వారేమో

తెలుగు మేష్టర్లు ఆనందపడేవారేమో …

కానీ …

మై డియరెస్ట్ ఫ్రెండ్ !!!

నాకు నీ స్థాయి లేదు

ఏడు దశాబ్దాల తర్వాత తెలుగు కూడా

సంస్కృతమైపోతుందేమో తెలీదు

లేక… మరు జన్మ ఉంటే …

నువ్వే ఆ తెలుగు మేస్టరవుతావేమో

ఊహించలేను…

గుండెలనిండా ప్రేమ నింపుకున్న

అనురాగ మూర్తివి …

ఆవిరవుతున్న ఆశలకి కొత్త

ఊపిరులూదే అభిమాన స్ఫూర్తివి…

తలపై కూస్తున్న తీతువుని

ఇలలో భయపిస్తున్న హేతువుని

కలలో జడిపిస్తున్న మృత్యువుని

ప్రెస్ క్లబ్ లో తలపై ముసిరే దోమల్ని

తోలినట్టూ … హుష్ అంటే పోతాయనుకున్నావా?

కొత్తేడాది రెండో రోజే

నువ్విచ్చిన బర్త్ డే పార్టీ లో

మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే

అని నీకు చెప్పిన గ్రీటింగ్స్

నిరర్ధకం.. అసంబద్ధం …

అండ్ అబద్ధం

అని నాడు తెలీదు

నేడు తెలిసినా చెయ్యగలిగిందేమీ లేదు …

అరుణ సాగర మధనం చేస్తే

ఉత్సాహం ఉరకలెత్తే కవితా

ఉచ్చైశ్రవం …

నికృష్టుల వికృత చేష్టలు

నిర్జించే హాలాహలం…

నీ మందస్మిత వదనం లాంటి

చంద్రుడూ … నువ్వెక్కిరించే

వైట్ ఎలిఫెంట్…

ఇలా అన్నీ పుడతాయ్ …

నీ రాతల మధనం చేస్తే

బూడిదలోంచి పైకి లేచే ఫీనిక్స్…

గుర్రం ఎగరావచ్చని నిరూపించే

పెగాసస్

ఇంకా … గ్రిఫిన్, యూని కార్న్ లాంటి ఇతర మిథికల్ మిరకిల్స్ అన్నీ

పుట్టుకొస్తాయ్ …

అదేదో ఒక జీనస్ … ఒక స్పీషీస్ నించీ

నేను లిబరేటెడ్ అని చెప్పుకున్నావ్

ఈ స్థాయికి ఎదగక పోతే

ఆస్ట్రసైజ్డ్ అనాల్సొచ్చేది అని కూడా

అన్నావ్ …

నువ్వు జ్జానదర్శివి

అన్నా… మనస్తే …

అని మనసుతో నమస్తే చెప్పి న

సోమవారం నాటి నీ వాట్స్ ఆప్

మన ఐహిక స్నేహానికి ఫుల్ స్టాప్

అయ్యింది …

నా కవితలకి తొలి పాఠకుడివి

నా ఆవేశానికి ఆపోశన వి

నా ఆలోచనలకి ఆది గురువు వి

నా ఆలాపనకి ఆలంబనవి

నువ్వు వెళ్ళిపోయిన ఆ తెలియని

చోటిక్కూడా మెసేజ్ పంపే

యాప్ ఒకటి వస్తుందేమో లే ఫ్రెండ్

అప్పటి వరకూ …

అల్విదా …

– సాయి శేఖర్

Sai Sekhar,Telugu Kavithalu