వైసీపీకి దగ్గరైన టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?

2022-06-05 02:54:30.0

ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయేమోననే ఆలోచన అందరిలోనూ ఉన్నది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న అధికార వైసీపీ, ఈ సారి అంతకు మించిన సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. అందుకే కీలక నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు ఇచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి పార్టీకి దగ్గర అయిన వారికి కూడా కొన్ని చోట్ల కీలక బాధ్యతలు అప్పగించారు. […]

ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయేమోననే ఆలోచన అందరిలోనూ ఉన్నది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న అధికార వైసీపీ, ఈ సారి అంతకు మించిన సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. అందుకే కీలక నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు ఇచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి పార్టీకి దగ్గర అయిన వారికి కూడా కొన్ని చోట్ల కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు.. వైసీపీకి దగ్గర అవడాన్ని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

విశాఖపట్నం దక్షిణం నుంచి టీడీపీ నుంచి గెలిచిన వాసువల్లి గణేష్.. వైసీపీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. దీంతో టీడీపీ నుంచి గెలిచి పార్టీకి దగ్గరైన ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితిపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేనట్లే కనిపిస్తున్నది. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు సరిగా సమన్వయం చేసుకోవడం లేదని.. అలాగే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కొంత మంది నాయకులు ఎమ్మెల్యేలకు సరిగా సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

టీడీపీ హయాంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా పార్టీలో చేర్చుకొని వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టాక ఆ తప్పు చేయనని ముందుగానే చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల నుంచి కరణం బలరాం, గుంటూరు పశ్చిమం నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్ టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరయ్యారు. అయితే పదవులకు రాజీనామాలు చేయకపోవడంతో వాళ్లు అధికారికంగా వైసీపీలో చేరలేదు. కానీ నియోజకవర్గ ఇంచార్జులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గాల నుంచి వీళ్లు వైసీపీ టికెట్లు వస్తాయనే లక్ష్యంతో పని చేస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలకే వచ్చేసారి వైసీపీ టికెట్లు వస్తాయని తెలిసినా.. ఆ పార్టీ నేతలు మాత్రం వారితో కలసి పని చేయడం లేదు. గన్నవరంలో వంశీకే పార్టీ బాధ్యతలు అప్పగించినా.. స్థానిక నేతల నుంచి ఆయనకు మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రాపు, దుట్టా రామచంద్రరావులు ఎమ్మెల్యేలతో కలసి పని చేయడానికి సిద్దంగా లేరు. వంశీకే వైసీపీ టికెట్ ఇస్తే తాము పార్టీ తరపున పని చేయమని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం వంశీకి సహకరించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. దీంతో గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎవరితో పని చేయాలనే డైలమాలో ఉన్నారు. కాగా, తనకున్న వ్యక్తిగత ఇమేజ్, కార్యకర్తలు గెలిపిస్తారని వంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తున్నది. ఈ జిల్లాలోని చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అయితే అక్కడి నుంచే వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ ఈ సారి అద్దంకి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అక్కడ తన బలాన్ని పెంచుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో యాక్టీవ్‌గా ఉన్నారు. అద్దంకి నుంచి పోటీకి సిద్దపడుతున్నారు. తండ్రి బలరాం చీరాల నుంచే ఈ సారి టికెట్ ఆశిస్తుండటంతో ఆయన అద్దంకిలో క్రీయాశీలకంగా మారారు. అదే సమయంలో ఆమంచి కూడా అద్దంకి సీటు కోసం పోటీ పడుతుంటం పార్టీకి ఇబ్బందిగా మారింది.

ఆమంచి కృష్ణమోహన్‌ను స్వయంగా వైఎస్ జగన్ స్వయంగా పిలిపించుకొని సముదాయించారు. చీరాల పక్కనే ఉన్న పర్చూరు నుంచి పోటీ చేయమని చెప్పారు. అక్కడ టికెట్ ఇస్తానని కూడా మాటిచ్చారు. అయినా సరే ఆమంచి మాత్రం అద్దంకి నుంచే పోటీకి దిగుతానని అంటున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన వారికి వైసీపీ నాయకులకు మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇది కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిస్థితి కూడా నియోజకవర్గంలో అంత ఆశాజనకంగా లేదు. ఈ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి ఏసురత్నం, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా టికెట్లు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తనకు కాదని టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ఏసురత్నం అంటున్నారు. ఈ సారి టీడీపీ టికెట్ రాదు కాబట్టి.. పార్టీకి దగ్గరయినందుకు నాకే టికెట్ ఇవ్వాలని మద్దాలి గిరిధర్ వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో ఆశాజనకంగా లేదు. వారికి వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం లేదన్నది వాస్తవమే. కానీ, ఆయా ఎమ్మెల్యేలకు బలమైన క్యాడర్ ఉండటంతో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. వాసుపల్లి గణేష్ రాజీనామా తర్వాత అయినా అధినేత జగన్ ఈ సందిగ్దతకు తెర దించుతారనే అందరూ భావిస్తున్నారు. ఎంత త్వరగా ఈ నియోజవర్గాలపై క్లారిటీ ఇస్తే పార్టీకి అంత మంచిదని కార్యకర్తలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.