2022-06-04 05:58:38.0
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఆ తర్వాత వైసీపీవైపు అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన వైసీపీ కేడర్ తో అంత త్వరగా కలవలేకపోయారు. ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆయన పార్టీకి దూరం జరిగేందుకు నిర్ణయించుకున్నారు. సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాశారు. […]
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఆ తర్వాత వైసీపీవైపు అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన వైసీపీ కేడర్ తో అంత త్వరగా కలవలేకపోయారు. ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు ఆయన పార్టీకి దూరం జరిగేందుకు నిర్ణయించుకున్నారు. సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాశారు. టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి కి ఈ లేఖను పంపించారు ఎమ్మెల్యే వాసుపల్లి. అయితే వారి నిర్ణయానికి బద్ధుడనై, పార్టీకోసం, నియోజకవర్గ అభివృద్ధికోసం కృషిచేస్తానంటూ చివర్లో ముక్తాయించారు.
వాసుపల్లి అలకకి కారణం ఏంటి..?
లేఖలో వాసుపల్లి ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే.. వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విశాఖ వచ్చినప్పుడు తనకు శల్యపరీక్ష పెట్టారని, బలప్రదర్శన కోరారని, దానివల్ల తన గౌరవానికి భంగం కలిగినట్టయిందని చెప్పుకొచ్చారు వాసుపల్లి. ఆరోజు జరిగిన పంచాయితీకి చింతిస్తున్నానని కూడా లేఖలో ప్రస్తావించారు.
టీడీపీలో తనని గౌరవంగా చూసుకున్నారని, జగన్ సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితుడినై తాను వైసీపీ వైపు వచ్చానని అన్నారు. అవమానాలు భరించలేకే తాను సమన్వయ కర్తగా తప్పుకుంటున్నానని చెప్పారు.
ఎమ్మెల్యే సీటుపై నమ్మకం లేదా..?
ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ 2024లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకున్నారు. ఆయనకు వైసీపీలో ఓ కీలక నేత ఆశీస్సులు కూడా ఉన్నాయని సమాచారం. దీంతో వాసుపల్లికి ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వరేమోనన్న అనుమానం మొదలైంది. ఆ దిశగా ఆయన పార్టీపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంలో ఇలా సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేశారని అంటున్నారు.
అటు వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలతో కూడా వాసుపల్లి సమన్వయం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తాడోపేడో తేల్చుకోడానికి ఆయన సిద్ధమయ్యారని అంటున్నారు. మరోవైపు టీడీపీ తనను గౌరవంగా చూసుకుందని చెప్పడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. టీడీపీ వైపు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న వాసుపల్లి… ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ycp