వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్దరిస్తాం

2024-11-12 12:37:50.0

ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా యంత్రాలు సరఫరా చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు

వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు. ఈ పథకానికి అవసరమైన నిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అవసరమైన యంత్రసామగ్రిపై ఉన్నతాధికారులతో మంగళవారం సెక్రటేరియట్‌ లో సమీక్షించారు. యాసంగి సీజన్‌ నుంచే ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ సీజన్‌ లో డిమాండ్‌ ఉన్న వ్యవసాయ పనిముట్లు, యంత్రాల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆయా యంత్రాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా రోటవేటర్లు, ఎంబీ నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, బేలర్స్‌, పవర్‌ వీడర్స్‌, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్‌ డ్రోన్లు తదితర యంత్రాలు రైతులు పంపిణీ చేయాలని ప్రతిపాదించామన్నారు. సోయాబీన్‌ సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. 47 కొనుగోలు కేంద్రాల ద్వారా 24,252 టన్నుల సోయా సేకరించామని, వీటి విలువ రూ.118.64 కోట్లు అని తెలిపారు. సమావేశంలో అగ్రికల్చర్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ గోపి, ఉన్నతాధికారి శ్యామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Congress Govt,Farm Mechanization Scheme,Tummala Nageshwar Rao,Farmers,Rabi Session