http://www.teluguglobal.com/wp-content/uploads/2015/07/Vyapam-Scam.jpg
మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణానికి సంబంధించి వరుస మరణాలు కొనసాగుతున్నాయి.నిన్నటికి నిన్న సాగర్‌లో ఓ మహిళా ట్రైనీ ఎస్సై శవమై తేలితే..తాజాగా రమాకాంత్ పాండే అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపం స్కామ్‌ని దర్యాప్తు చేస్తున్న సిట్ గతవారమే పాండేని ప్రశ్నించింది. ఇంతలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. మరణ మృదంగంః వ్యాపం కుంభకోణంలో వరస అసహజ మరణాలు మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి స్కామ్‌లో ఓ నిందితురాలి హత్యకు సంబంధించి..ఆమె తండ్రి అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్లిన టీవీ […]
మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణానికి సంబంధించి వరుస మరణాలు కొనసాగుతున్నాయి.నిన్నటికి నిన్న సాగర్‌లో ఓ మహిళా ట్రైనీ ఎస్సై శవమై తేలితే..తాజాగా రమాకాంత్ పాండే అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపం స్కామ్‌ని దర్యాప్తు చేస్తున్న సిట్ గతవారమే పాండేని ప్రశ్నించింది. ఇంతలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది.
మరణ మృదంగంః
వ్యాపం కుంభకోణంలో వరస అసహజ మరణాలు మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి స్కామ్‌లో ఓ నిందితురాలి హత్యకు సంబంధించి..ఆమె తండ్రి అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్లిన టీవీ జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్.గత శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరికొద్దగంటలకే కుంభకోణం దర్యాప్తులో సహకరించిన జబల్‌పూర్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్‌శర్మ ఢిల్లీ హోటళ్లోలో శవమై కనిపించారు. ఇక నిన్నటికినిన్న ట్రైనీ ఎస్ఐ, తాజాగా కానిస్టేబుల్ మరణాలు షాక్‌కి గురిచేస్తున్నాయి. 2012లో వ్యాపం నిర్వహించిన పరీక్ష ద్వారానే వీళ్లిద్దరూ పోలీస్ ఉద్యోగాలు సంపాదించారు.
వ్యాపం అంటే..?
మధ్యప్రదేశ్‌లోని మెడకల్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించడం కోసం 80వ దశకంలో ఇది ఏర్పాటైంది. తర్వాతికాలంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ దగ్గర్నుంచి..టీచర్ రిక్రూట్‌మెంట్, ఆయుర్వేద డాక్టర్ల నియామకం, ఎస్సై పోస్టుల భర్తీ వరకు వ్యాపం ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిగాయి. 2007-2013 మధ్య కాలంలో జరిగిన ప్రతి జాబ్ టెస్ట్‌లో అక్రమాలు జరిగాయి. అనర్హులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. కనీస విద్యార్హతలు లేనివాళ్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొల్లగొట్టారు. సీఎం పేషీ దగ్గర్నుంచి గవర్నర్ రాజ్‌భవన్ వరకు వ్యాపం స్కాంతో ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువుల నుంచి గవర్నర్ కొడుకు వరకు నిందితుల జాబితాలో ఉన్నారు.
రూ.2వేల కోట్ల స్కాం..40కిపైగా అసహజ మరణాలు
మధ్యప్రదేశ్‌లో జరిగిన బ్యాంకు పరీక్షలు సహా దేన్నీజాబ్ మాఫియా వదిలిపెట్టలేదు. ఇది 2వేల కోట్ల అతిపెద్ద కుంభకోణం..! అంతేకాదు ఓ స్కాంలో వరుస అసహజ మరణాలు నమోదైన సందర్భం కూడా ఇదే! కుంభకోణాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారడం సాధారణమే! అయితే కేసుతో సంబంధమున్నసాక్షులు, నిందితులు, చివరకు పరీక్ష రాసిన అభ్యర్థలుసహా 45మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు నివేదిక ఇచ్చిన
మెడికల్ కాలేజ్ డీన్‌తోబాటు..పరిశోధనాత్మక కథనం కోసం వెళ్లిన జర్నలిస్ట్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
సిబిఐ దర్యాప్తుకు డిమాండ
దేశ చరిత్రలోనే వ్యాపం అతిపెద్ద కుంభకోణమంటోంది కాంగ్రెస్. చాలాకాలంగా వ్యాపకం లేని దిగ్విజయ్‌సింగ్‌లాంటి నేతలకు వ్యాపం స్కాం ఆయుధంగా మారింది. తక్షణం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ అవసరమే లేదంటున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్. సిట్ విచారణ నిస్పక్షిపాతంగా జరుగుతోందని కవర్ చేస్తున్నారు. అటు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సిబిఐ విచారణ అవసరం ఏముంందని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు చూద్దాం అని తప్పించుకుంటున్నారు.
సిల్లీ ఇష్యూ?
వ్యాపం స్కాంపై దేశవ్యాప్తంగా ఇంత రగడ జరుగుతుంటే ఇంతవరకు ప్రధాని నోరు మెదపలేదు. మరోవైపు ఇదో సిల్లీ ఇష్యూ అని కొట్టిపారేస్తున్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. ఇలాంటివాటిపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదంటున్నారాయన! సిబిఐ విచారణ ఎందుకు దండగ? సిట్ విచారణ జరుగుతోందిగా..అంటూ వెర్రినవ్వు నవ్వి సైడైపోయారు. వ్యాపం చిన్నస్కాం కాదు. కష్టపడి చదివినవారికి సీట్లు, ఉద్యోగాలు దక్కకుండా చేసిన స్కాం. రెండువేల కోట్ల స్కాం మాత్రమేకాదు..ఇంతవరకు 2వేలమందిని సిట్ విచారించిందంటే కుంభకోణం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీమించి 40కిపైగా అసహజ మరణాలు నమోదైన కుంభకోణం! సాక్షాత్తూ మధ్యప్రదేశ్ గవర్నర్ కొడుకు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ జాబ్ మాఫియా ఏ స్థాయిలో వ్యవస్థను శాసిస్తోందో!
-సౌజన్య కీర్తి
Maharastra Government,Silly issue,Vyapam Scam
https://www.teluguglobal.com//2015/07/07/is-vyapam-scam-a-silly-issue/