శనివారం మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు

2024-12-27 05:27:22.0

రాజ్‌ఘాట్‌ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల వెల్లడి

https://www.teluguglobal.com/h-upload/2024/12/27/1389441-manmohan.webp

భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. శనివారం (డిసెంబర్‌ 28) ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మన్మోహన్‌ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్‌ఘాట్‌ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి దించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్‌ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనున్నది. కాంగ్రెస్‌ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది. 

Manmohan Singh death,Government declares 7-day mourning,Ex-PM’s last rites on Saturday,Thursday night in critical condition,Central Cabinet