2023-04-30 12:48:16.0
https://www.teluguglobal.com/h-upload/2023/04/30/734332-sha.webp
ఓ అసిస్టెంట్ అనారోగ్యంతో శెలవులో వెళ్లటంతో తాత్కాలిక ఉద్యోగినైన నన్ను ఆరు నెలలపాటు మంగళగిరి
వెళ్లమన్నారు. అలా ఆ ఊళ్లో కాలుపెట్టాను. పెళ్లి కాలేదు కనుక పెద్ద ఇల్లు అవసరంలేదు. ఆ ఆఫీసులోనే పనిచేసే ఓ బ్రహ్మచారి తన గదిలో ఉండొచ్చని చెప్పటమే కాకుండా తను తినే సౌభాగ్య మెస్కే నన్నూ తీసుకువెళ్లాడు.
దాన్ని నడుపుతున్నది వంద కేజీల ఆంటీ. ఆ ఇంటికి పాత కాపే అయిన అతడు నా గురించి చెప్పగానే,
సంతోషపడిపోతూ, “సుందరీ! ఖాతా పుస్తకం, కలం పట్టుకురా!” అన్నది.
కొద్దిక్షణాల్లోనే ఆ వరండాలో ఓ మెరుపుతీగ పుస్తకం పట్టుకుని తళుక్కుమన్నది… పేరుకు తగ్గట్టు సుందరే.
“అవి ఇటు ఇచ్చి తింటున్న వాళ్ల సంగతి చూడు… ఎక్కడా లోపం రాగూడదు… వాళ్లు స్వంత ఇంట్లోనే భోజనంచేస్తున్నంత ఆనందంగా ఉండాలి!” మెస్సునుండి కస్టమర్లు జారిపోకుండా వల విసరటంలో మహా దిట్ట అని ఆమె
మాటల్లో అర్థమయింది.
ఆ అమ్మాయి లోపలకు వెళ్లగానే, “వెయ్యి రూపాయలు అడ్వాన్సు ఇవ్వండి… అవి అయిపోగానే
మళ్లా ఇద్దురుగాని!” అన్నది నవ్వుతూ.
సౌభాగ్య మెస్ పీటమీద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఆరిటాకుల్లో పదార్థాలు వడ్డించే ఆ పిల్ల అమృతం
పంచుతున్న మోహినిలా కనబడుతుండటంతో పదార్థాల రుచి గురించి ఆలోచించే అవసరం ఎవరికీ రాదు.శెలవునాడు కూడా ఇంటికి
వెళ్ళాలనిపించనంతగా మైమరిపిస్తోంది ఆమె అందం…
వారం రోజుల తరువాత ఓ
రోజు శెలవు రావటంతో మధ్యాహ్నం భోజనానికి తీరిగ్గా వెళ్లాను. ఒంటరి పక్షులన్నీ స్వంతగూళ్లకు చేరినట్లున్నాయి
రోజూ నవ్వులతోనూ, మాటలతోనూ గలగలలాడుతుండే ఆ హాలు కొద్దిమందితోనే నిశ్శబ్దంగా కనబడింది.
“మామిడికాయ పప్పు ఇంకాస్త వేయమంటారా?”
“ఆవపెట్టిన పెరుగు పచ్చడి ఉంటే పట్రండి… మహదానందంగా తినేస్తాను!” కొద్దిరోజుల్లోనే చనువు ఏర్పడింది.
“గుర్తు పెట్టుకుంటాలేండి!” ముఖం పక్కకు తిప్పుకున్నది చిరునవ్వులు చిందిస్తూ.
వలపులు ఒలకబోసే వయసే. పెళ్లి కాని ఆమెకు దగ్గరవ్వాలనే ఉత్సాహం మనసును ప్రోత్సహిస్తోంది
ఆ రోజు సాయంత్రం టూత్ పేస్ట్ కొందామని వెడితే అక్కడ సరుకులు కట్టిస్తూ కనబడ్డది ఆ అమ్మాయి.
నన్ను చూస్తూనే పెదవుల మీద చిరునవ్వు… నేను నాటుకున్న మొక్కకు నీళ్లు పోస్తున్నట్లుగా.
“ఇది కూడా మీ డ్యూటీయేనా?”
“రెండు నెలల క్రితం పక్షవాతంతో మామయ్య మంచానపడేంతవరకూ ఆయనే తెస్తుండేవారు!”
“భారీ శరీరాన్ని బయటకు తేలేని పెద్దామెకు చేయి అందించటంలో తప్పులేదులేండి… అవసరమొచ్చినప్పుడయినా
నాలాంటి వాడి సాయం తీసుకోవచ్చుగదా… అవునూ, అత్తయ్య అంటే మీ నాన్నగారి సోదరా?”
“మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు… రెండు సంవత్సరాల క్రితం అమ్మా నాన్నా ప్రమాదంలో ఒకేసారి వెళ్లిపోతే ఎవ్వరూ లేని నన్ను చేరదీసింది!”
నేనూ నాకు కావాల్సింది కొనుక్కుని ఆమెతోపాటు బయటకొచ్చాను.
“సరుకులు తీసుకోలేదు… బరువనుకుంటే నేను పట్టుకు వస్తాను కదా!” ముందుకు దూకందే పనికాదు.
“ఆ శ్రమ మనకెందుకూ… వారానికి రెండుసార్లు ఉండేదే… షాపులో కుర్రాడే తెచ్చి పడేస్తాడు!” అన్నది. అదేచిరునవ్వు. అలాంటి ఆడపిల్ల పక్కన నడవటమే ఓ ఆనందం.
“పెద్దామె కష్టాల్లో ఉన్న స్నేహితురాలి కూతుర్ని దగ్గరకు తీయటం ప్రశంశనీయమేగాని, నాకెందుకో మీరు
చేస్తున్న పని నచ్చలేదు!” అన్నాను చిన్నగా జాలిగా ఆమెనే చూస్తూ.
భోజనాలుచేసే సమయంలో ఆమెమీద మిగతావారి
చూపులు, వెకిలి నవ్వులు గుర్తుకు రాగా, ‘మరీ మనుషులు పెచ్చుమీరి పోతున్నారు’ మనసులోనే విసుక్కున్నాను.
సుందరి మాట్లాడలేదు.
నాలోని అనుమానం తీర్చుకోవాలి అన్నట్లుగా “రోజూ భోజనానికి ఎంతమంది వస్తారండి?” అడిగాను.
“ముప్పయి మంది దాకా ఉంటారండి!”.
సంశయిస్తున్నట్లుగా ఒక్కక్షణం ఆగి, “మీరు రాకముందు?” అడిగాను.
“పదిమంది వచ్చేవారనుకుంటాను!”
ఆంటీ అంతరంగం ఇట్టే అర్థమయిపోయింది. స్నేహితురాలు పోవటాన్ని ఆసరాగా తీసుకుని నిస్సహాయురాలయిన
బంగారుబొమ్మకు రక్షకురాలు అనే ముసుగు తగిలించుకున్నదన్నమాట శరీరమే కాదు, బుర్రకూడా పెద్దదే!
మెస్సుకు ఎక్కువమందిని రప్పించుకు నేందుకు సుందరిని ఎరగా వాడుకుంటున్నది. ఈమెకు ఆ సంగతి తెలిసినా
మరో గత్యంతరంలేక ఆ పని చేస్తున్నదో, లేక అసలు విషయం తెలుసుకోలేక పోతున్నదో అర్థంకాలేదు.
చక్కగా సంసారం చేసుకోవాల్సిన వయసులో ఆమె ఇలాంటి ఊబిలో ఇరుక్కోవటం బాధ కలిగిస్తోంది.
పది రోజుల తరువాత ఆఫీసు పనితో ఆలస్యంగా వచ్చిన నేను వడ్డన చేస్తున్న ఆమెను చూస్తే ఎందుకో బాధ పడుతున్నట్లుగా గ్రహించాను.
దిగులుతో ముఖం కుంచించుకు పోయినట్లున్నది. రోజూ కనబడే హుషారు, మాటల్లో
చిరునవ్వులు కనబడలేదు. కారణం తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగినా. అంతమంది మధ్యలో స్వేచ్ఛగా మాట్లాడలేను.
ఆపైన ఆంటీ తలుపు దగ్గరే కుర్చీలో కూర్చుని డేగ కళ్లతో చూస్తోంది.
ఎలాగా అని అనుకుంటూ భోజనం చేసి బయటకు వస్తున్న సమయంలో ఆ అవకాశం రానే వచ్చింది.
“ఇదుగో సుందరీ! అందరూ
అయిపోయినట్లేనా… తలుపులు మూసి పెందరాళే పడుకో… ఏడింటికల్లాకొండకెళ్లి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకు రా… నీ ప్రతి పుట్టిన రోజునాడు మీ అమ్మ నిన్ను తీసుకువెళ్లిస్వామివారికి పానకం, అమ్మవారికి కుంకుమపూజ చేయించేది… అది చచ్చి ఏలోకానుందో… నేనా నీ బాగోగులు
చూసేదాన్నే కానీ ,దానిలాగా నీ వెంట పరుగెత్తలేను గదా… ఆటోలో వెళితే త్వరగా వచ్చి వంట మొదలెట్టవచ్చు!”
ఆ మాటలు వింటున్న నేను రేపు నా కార్యక్రమం ఏమిటో క్షణాలల్లో నిర్ణయించేసుకున్నాను. ఓ గంటసేపు ఆ అమ్మాయికి ఆంటీ మనసు, నా మనసు కూడా తెరిచిన పుస్తకంలా పరిచి చూపించవచ్చు. ఆరింటికే వెళ్లి మెట్ల క్రింద రధం పక్కన ఏదో పనివున్న వాడిలా అటూఇటూ తిరగటం మొదలు పెట్టాను.
తరువాత పావుగంటలోనే సుందరి వచ్చింది. తలారా స్నానం చేసి, ఒత్తుగా వున్న జుట్టు ఆరేందుకు అన్నట్లుగాపైన ఓ రబ్బరు బ్యాండ్ వేసి వదిలేసింది. కాళ్లకు పసుపు, కళ్లకు కాటుక… ముఖానికి కళనిచ్చే చిన్న బొట్టు…ఆకాశం రంగు పట్టు చీర… చేతిలో పూల సజ్జ…
“అదేమిటి ఇటు వచ్చారు… వంట కార్యక్రమం లేదా?” అన్నాను ఆశ్చర్యపోతున్నట్లుగా ముఖంపెట్టి.
“ఇవ్వాళ నా పుట్టినరోజండి… స్వామి వారిని దర్శించుకుందామని… మరి మీరెందుకు వచ్చారు ఇక్కడకు?”
“మై గాడ్! నా పుట్టిన రోజూ ఇవ్వాళే… ఈ ఊరు వస్తున్నప్పుడే మా అమ్మ చెప్పింది… పొద్దున్నే కొండమీదకెళ్లి
స్వామిని దర్శించుకోరా అని… కన్నతల్లి మాట నాకు వేదవాక్కు!”
“మంచిదే… ఇంకేం పదండి ఆటో ఎక్కేద్దాం, త్వరగా పూజ చేయించి వచ్చేయవచ్చు!” అంటూనే పైకెళ్లే సర్వీస్ఆటో ఎక్కి కూర్చున్నది.
ఇక చేసేదేమున్నది… ఆమె పక్కనే కూర్చున్నాను వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనట్లుగా.
“అభినందనలండీ… ఎన్నో పుట్టినరోజు ?”అడిగాను
“గుర్తులేదు!” చాలా నిర్లిప్తంగా అన్నది. “ఇది నా జీవితానికి మిగిలిన చాలా చిన్నవిషయమండి… ఆంటీ ఏ
కళనున్నదో వెళ్లమనటంతో ఈ అవకాశాన్ని వదులుకోలేక వచ్చాను!”.
“చాలా మంచి పని చేశారు… మీతో మాట్లాడాలనే కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నాను… ఆ సమయం
ఇప్పటికి వచ్చిందన్నమాట!”
ఆమె మాట్లాడలేదు గాని కాస్త ఇబ్బందిగా నా వంక చూడటం గమనించాను.
“మీరు మెస్ పరాయి వాళ్లకు భోజనాలు వడ్డిస్తున్నప్పుడు వాళ్ల చూపులు చూస్తూ, మాటలు వింటుంటేనాకయితే చాలా అసహ్యం అనిపిస్తోంది!”
కొండపైకి మలుపులు తిరుగుతూ పోతున్న ఆటోలో ముఖాన్ని నావైపుకు తిప్పి బిత్తరపోతున్నట్లుగా చూచింది.మరుక్షణంలోనే తలవంచుకుని, “కడుపుకు తిండి కావాలి… ఉండటానికి గూడు కావాలి… క్రూర మృగాల
బారిన పడకుండా నన్ను నేను రక్షించుకునేందుకు మరో చేయి ఆసరాగా కావాలి!” చాలా చిన్నగా అన్నది.
ఆమెనే నిశితంగా చూస్తూ, “మీకు మీవాళ్లంటూ ఎవరూ లేరా?” అడిగాను.
‘ఎవ్వరూ లేరు’ అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.
“ఆంటీ మిమ్మల్ని దగ్గరకు తీయటానికి కారణాలు ఏమిటో మీకు తెలుసా?”
“అవి ఏవైనా కానీయండి… ఎవరూ స్వార్థం లేకుండా వేరొకరికి సాయం చేస్తారని అనుకోను!” గుడి దగ్గర
ఆటో ఆగటంతో దిగాం.
ఇంకా నేను చెప్పేదేమున్నది? ఆ మాటతో ఆమెకు ఆంటీ అంతరంగం తెలుసనే అర్థమయింది.
పూజలనంతరం వచ్చి చెట్టుక్రింద గట్టుమీద కూర్చున్నాం కాసేపు ఇద్దరం.
“నిన్న మీరు చాలా దిగులుగా ఉన్నట్లనిపించింది నాకు!” ఆమెనే చూస్తూ అన్నాను.
ఉలిక్కిపడ్డట్లుగా తలెత్తి కొద్ది క్షణాలపాటు నన్నే చూస్తుండిపోయింది.
ఆలస్యం చేయలేదు నేను. “సమస్య తెలిస్తే విరుగుడు ఏమైనా దొరుకుతుందేమో ఆలోచిద్దాం అని!”
ఆమె చెప్పాలా వద్దా అన్నట్లుగా కొద్దిసేపు తటపటాయిస్తూ ఆగి, “మెస్సుకు భోజనానికి వచ్చే గంగాధరంగారుతెలుసుగదా… ఆరు నెలల క్రితమే ఆయన భార్యపోయింది… మొన్న రాత్రి నన్ను అడిగాడు రెండో ఆట సినిమాకు
వెళదాం వస్తావా అని!” ఆమె దిగులుగా తలవంచుకున్నది. “ఇలా మెస్సుకు వచ్చే వాళ్లలో చాలా మంది చాలా విధాలుగా నా ద్వారా కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు!” ఆ మాటలు అంటున్నప్పుడు కంఠం
జీర బోయింది.
“ఆంటీకి చెప్పలేదా?”
“చెప్పాను… మాట్లాడతాలే అంటుందిగాని… గట్టిగా అడిగితే కోపమొచ్చి వాళ్లు ఎక్కడ భోజనానికి రావటం మానేస్తారోనని భయపడుతున్నట్లుగా అనిపించింది… ఎవరి ఇబ్బందులు వారివి!” బాధలోనే పేలవపు నవ్వు
మూడు రోజుల తరువాత షాపులో కలిసినప్పుడు, “మా అత్తయ్యకు మరో కోరిక కూడా ఉన్నది… తన చెప్పుచేతల్లో ఉండే కుర్రవాడు ఎవరైనా దొరికితే నన్నిచ్చి పెళ్లిచేసి, మా చేత క్యాటరింగ్ ప్రారంభించాలని!” చెప్పింది.
‘బ్రతికున్నంతకాలం అందమైన ఎవరూలేని ఈ అమ్మాయినే తన వ్యాపారంలో పావుగా వాడుకోవాలనేది
ముసలావిడ కోరికన్నమాట!’ జాలిగా చూశాను ఆమె వంక.
00000
నెలరోజుల తరువాత ఓరోజు రాత్రి తొమ్మిది గంటలప్పుడు భోజనం చేసి బయిటకు వస్తుంటే, “సుందరీ! ఎవరో
కొత్తవాళ్లు వస్తున్నట్లున్నారు చూడు! పుస్తకం, కలం పట్టుకురా!” వరండాలోనే కూర్చుని ఉన్న ఆంటీ పెద్దగా పిలిచింది.
సుందరి బయటకు వచ్చి వాళ్లను చూస్తూనే, “రండి రండి… !!
అత్తయ్యా! వీరు వంటలో మంచి ప్రావీణ్యులు రేపు విజయదశిమికి క్యాటరింగ్ ప్రారంభిద్దామని, మాట్లాడటానికి రమ్మనమన్నాం!” అన్నది.
ఆంటీ ఆ మాట వింటూనే సంతోషంగా, “నిజమా?” అన్నది నోరంతా తెరిచి.
“అవునండీ! నేనూ సుందరీ కలిసే అన్ని ఏర్పాట్లు చేశాం… విజయదశమి ముందురోజు మన ఊరి మాజీ
ఎమ్మెల్లేగారి మనవరాలు పెళ్లి సందర్భంలో మొదటిసారి జండా ఎగరేద్దామని ఆర్డరు కూడా తీసేసుకున్నాం!”
కాస్తంత తేరుకున్న ఆంటీ మా ఇద్దరినీ రెప్పలార్పటం కూడా మర్చిపోయి మార్చిమార్చి చూస్తున్నది.
“మన పక్కిల్లు ఖాళీగా ఉండటంతో రెండు నెలల అద్దె బయానాగా ఇచ్చాం, అందులోనే మీ సహాయ సహకారాలతో’సౌభాగ్యా క్యాటరర్స్’ ప్రారంభించాలని… నేను చేస్తున్నది తాత్కాలిక ఉద్యోగమే కనుక రాజీనామా చేస్తాను. ఇక
శాశ్వతంగా మీ స్నేహితురాలి కూతురుని నా గృహిణిగా మార్చుకుంటే, కష్టసమయంలో దగ్గరకు తీసినందుకు ఓ
ఇంటి దాన్ని చేశాననే తృప్తి మీకూ ఉంటుంది. అటు ఆ అమ్మాయి గృహిణిగా నాతో గుంభనగా ఆనందాన్నిపంచుకోవటమే కాకుండా, ఆర్థిక మంత్రిగా సరైన సమయంలో సరైన సలహాలిస్తుంటుంది… క్యాటరింగ్ పనులన్నీ
పర్యవేక్షించేందుకు నాకు తోడుగా మా అమ్మా, నాన్నా వస్తున్నారు…
ఇక మీరు హాయిగా మంచంలో ఉన్న
మామయ్యగారికి సపర్యలు చేసుకుంటూ, మిమ్మల్నే నమ్ముకున్న ఒంటరిగాళ్లకు మేం ఏర్పాటు చేయబోతున్న ఇద్దరుకుర్రాళ్ల చేత వంటలూ, వడ్డనలూ చేయించవచ్చు…,సుందరీ! ఇటురా… దేవుడి గూట్లోనుంచి నాలుగు అక్షింతలు పట్టుకువస్తే మన భవిష్యత్తు మూడు పువ్వులు, ఆరుకాయల్లా వెలిగిపోవాలని ఆంటీ దీవెనలు తీసుకుందాం!”
బిగుసుకుపోయి కూర్చున్న వంద కేజీల ఆమె పాదాల దగ్గర బాసిo పట్టు వేసుకు కూర్చున్నాను, మూడు రోజులకొకసారి సరుకుల కొట్లో సుందరీ, నేనూ కలుసుకుంటూ ఆలోచనలు చేసి విజయం సాధించగలిగామనే సంతోషంతో.
– పి.ఎస్.నారాయణ
PS Narayana,Telugu Kathalu