2024-08-03 01:44:06.0
దేశ రాజధానిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో అనుమానాస్పద మరణాలు వెలుగుచూశాయి.
https://www.teluguglobal.com/h-upload/2024/08/03/1349315-asha-kiran-shelter-home.webp
దేశ రాజధానిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో అనుమానాస్పద మరణాలు వెలుగుచూశాయి. ఇక్కడ 20 రోజుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ హోమ్ లో 27 మంది చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. అందులో ఎక్కువ మంది మానసిక వికలాంగులే. ఈ నేపథ్యంలో షెల్టర్ హోమ్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు ఆందోళనలతో స్పందించిన ఆప్ ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
దేశ రాజధానిలో ఇటువంటి పరిణామం చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. ఇటువంటి నిర్లక్ష్యాలను సహించేదిలేదని, పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. మృతుల సంఖ్యపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2024 జనవరి నుంచి ఈ షెల్టర్ హోమ్‌లో 27 కాదు 14 మరణాలు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. దీనిపై మెజిస్టీరియల్ విచారణ చేపట్టాలని ,48గంటల్లోగా దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దీనిపై స్పందించింది. నిజనిర్ధారణ బృందాన్ని ఆ షెల్టర్ హోమ్‌కు పంపింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తుందని చెప్పారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ నేతలు కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పిల్లలకు ఆహారం అందడం లేదని, మురికి నీరు సరఫరా చేస్తున్నారని, వైద్యసౌకర్యాలు లేవని బీజేపీ మహిళా మోర్చా ఆరోపించింది.
ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఆశా కిరణ్ పేరుతో ఉంది ఈ మానసిక వికలాంగుల ఆశ్రమం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ హోం సాంఘిక సంక్షేమ శాఖ కిందకు వస్తుంది. ఇటీవల దాని ప్రధాన అధికారి రాజీనామా చేయడంతో అది ఖాళీగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ఆ శాఖ బాధ్యతలను వేరే మంత్రికి అప్పగించలేకపోయినట్టు తెలుస్తోంది.
AAP,Mysterious Deaths,Delhi News,Delhi Govt,Latest Telugu News,Delhi Shelter Home,Children Mysterious Deaths,Asha Kiran Shelter Home