2025-02-12 05:32:01.0
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్
‘భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు… ఆదివారాలూ పనిచేయండి’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ మరోసారి వార్తల్లో నిలిచారు. నిర్మాణరంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సంక్షేమ పథకాల అమలు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వాటివల్లనే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు.
చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన కార్మికుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. మా సంస్థలోప్రస్తుతం 2.5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ ఆ విషయం పెద్దగా బాధించడం లేదు. కానీ కార్మికుల లభ్యత గురించి నేను ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను. ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. ఇక అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణం కావొచ్చు. వాటి వల్లనే వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.
అయితే ఇది కార్మికుల్లో మాత్రమే కాదు.. వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణుల్లోనూ ఇదే భావన ఉందనిపిస్తున్నది. నేను ఎల్ అండ్ టీ సంస్థలో ఇంజినీర్‌గా చేరినప్పుడు మా బాస్ ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా వ్యక్తిని అలా అడిగితే ‘బై’ అంటూ వెళ్లిపోతున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Labourers in India,Not willing to work,Due to welfare schemes,L&T chairman SN Subrahmanyan