సంభల్‌ అల్లర్ల అంశంపై దద్దరిల్లిన లోక్‌సభ

2024-12-03 08:38:30.0

ఈ ఘటన వెనుక బీజేపీ ఉన్నదన్న ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ వ్యాఖ్యలపై ఎన్డీఏ నేతల ఆగ్రహం

https://www.teluguglobal.com/h-upload/2024/12/03/1382937-akhilesh.webp

యూపీలోని సంభల్‌ అల్లర్ల అంశంపై చర్చకు విపక్షకు పట్టుబట్టడంతో పార్లమెంటులో గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ప్రాంతంలో అల్లర్లు జరగడంలో బీజేపీ ప్రమేయం ఉన్నదంటూ ఆయన పరోక్షంగా ఆరోపించారు. జీరో అవర్‌లో అఖిలేశ్‌ సంభల్‌ అంశాన్ని లేవనెత్తారు. ‘సంభల్‌లో హింసాకాండ సృష్టించడానికి పక్కా ప్రణాళికతో కుట్ర చేశారు’ అంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. యూపీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకల నుంచి దృష్టి మళ్లించడానికే కుట్ర చేశారని.. అనంతరం అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించారు

సీఐ ప్రజలపై దుర్భాషలాడారు. వారిపై కాల్పులు జరిపారు. ఐదుగురు అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలి. ఆ పోలీసులను సస్పెండ్‌ చయాలి. బాధితులకు న్యాయం జరగాలని ఎస్పీ చీఫ్‌ డిమాండ్‌ చశారు. లఖ్‌నవూ, ఢిల్లీ మధ్య పోరు జరుగుతున్నది. కేంద్రంలో అధికారం సాధించిన విధానాన్ని లఖ్‌నవూలో ఉన్న వారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అఖిలేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ నేతలు తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో లోక్‌సభలో టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది.అఖిలేశ్‌ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. నవంబర్ 24న జరిగిన పోలీసు కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని పేర్కొంది.

కాగా.. యూపీలోని సంభల్‌ జిల్లాలో ఓ మసీదు ఉన్న స్థానంలో దేవాలయం ఉన్నదని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పుపెట్టారు. ఆ ఘర్‌షణలో ఐదుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.

Sambhal violence,Samajwadi Party,Akhilesh Yadav,BJP,Yogi Adityanath government,INDIA bloc