సమాంతర రేఖలు

2023-09-15 06:35:38.0

https://www.teluguglobal.com/h-upload/2023/09/15/825558-samanthara-rekha.webp

ఉదయాన్నే

అరుణకిరణాన్ని చూసి

మైమరచి పోతా నేను

అది ప్రతిరోజు  చూసేదేగా  

అంటావు నీవు

ప్రతి పువ్వునూ పలకరిస్తానేను

వాటికి మాటలొస్తాయా

అంటావు నీవు

వానలో తడవడం  నాకిష్టం

జలుబు  చేస్తుంది వద్దంటావు

వెన్నెల్లో ఆకాశం వైపు

చూడటం నాకిష్టం

నిద్రపోతుంటావు  నీవు

ప్రకృతిలో  ప్రతీది ప్రత్యేకం  

అంటాను నేను

ఏముంది  కొత్తగా

నీ భ్రమ అంటావు నీవు

ప్రతి దానికి స్పందిస్తాను నేను

నీవొక పిచ్చివాడనంటు చూస్తావు

జతలో ఇద్దరం

ఆలోచనల్లో భిన్నత్యం

నీవు చూసేది అందం

నేను ఆశించేది సౌందర్యం

నాది భావుకత

నీది వాస్తవికత

మనమద్య కనీ కనపడని

పల్చని తెర

నా ఎదుట నీవు

నీ ఎదుటనేను

సమాంతర రేఖల్లా

కలిసి నడుస్తుంటాం

ఎప్పుడూ కలసుకోలేం

ఒకరినొకరు చూసుకుంటుంటాం

కలిసి ఉండలేం

భూమ్యాకాశాల్లా …

కళ్లే వెంకటేశ్వర శాస్త్రి

Samantara Rekhalu,Telugu Kavithalu,Kalle Venkateswara Sastry