సింగపూర్‌ విదేశాంగ మంత్రితో సీఎం భేటీ

2025-01-17 05:37:02.0

గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణం తదతర అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌రెడ్డి బృందం సింగపూర్‌లో పర్యటన కొనసాగుతున్నది. సీఎం నేతృత్వంలో ఈ బృందం నిన్న రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. ఈ రోజు ఉదయం సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌తో పర్యటన ప్రారంభమైంది. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణం తదతర అంశాలపై చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆ దేశంలో జరిగిన అభివృద్ధితో పాటు తెలంగాణలో అమలు చేయదలిచిన ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగింది.

ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా ప్రారంభమైన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ కి ఉన్నటువంటి అవకాశాలపై , టూరిజం, విద్య, మూసీ పునరుద్ధరణ వంటి అనేక విషయాలపై వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌ చర్చించారు. సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలతో పోల్చి చూసి, ఇంకా చేయాల్సిన పనులు, నిధుల సమీకరణ వంటివి ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నేటి పాటు రేపు, ఎల్లుండి సింగపూర్‌లోనే రాష్ట్ర బృందం పర్యటించనున్నది.

సింగపూర్‌లోని చాంగిలో స్కిల్‌ యూనివర్సిటీ ఉన్నది. రాష్ట్రంలోనూ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కు శ్రీకారం చుట్టారు కాబట్టి అక్కడి ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? వాటికి సంబంధించిన నిర్వహణ విధానం ఏ విధంగా ఉన్నది? వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న స్కిల్‌ వర్సిటీకి అక్కడి యూనివర్సిటీని భాగస్వామ్యం చేసుకోవడానికి ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే సింగపూర్‌లో ఉన్న పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఉండే అవకాశాలను చర్చించనున్నారు. 20వ తేదీన అక్కడి నుంచి దావోస్‌ వెళ్లనున్నారు. అక్కడ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడికి వచ్చే వివిధ దేశాల నేతలు, పారిశ్రామిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, నిపుణులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంపై ప్రధానంగా వివరించనున్నారు. 

C M Revanth Reddy,Singapore tour,Meet Foreign Affairs Minister Vivian Balakrishnan,Focused on forging broad,sustainable green energy initiatives,water management,River rejuvenation,Tourism,Education and skills development