2016-02-26 03:42:00.0
ఎన్ని చట్టాలు చేసినా, నాయకులు ఎన్నిమాటలు చెబుతున్నా అమ్మాయిలపై దౌర్జన్యాలు ఆగడం లేదు. వారు మరింత ధైర్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన ఒకటి బెంగలూరు విద్యార్థినికి ఎదురైంది. విద్యార్థిని స్నేహితుడితో గొడవ పెట్టుకున్న బస్ కండక్టర్ ఆ అమ్మాయిని నలబై అయిదు నిముషాలపాటు సిటీబస్‌లో నిర్బంధించాడు. ఆమె పెద్దగా అరచి ఏడ్చినా సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు సైతం ఆమెకు అండగా నిలబడలేదు. చివరికి ఆమె ఫేస్‌బుక్‌లో తన బాధని పంచుకోవాల్సి […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/CITY-Bus.png
ఎన్ని చట్టాలు చేసినా, నాయకులు ఎన్నిమాటలు చెబుతున్నా అమ్మాయిలపై దౌర్జన్యాలు ఆగడం లేదు. వారు మరింత ధైర్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన ఒకటి బెంగలూరు విద్యార్థినికి ఎదురైంది.
విద్యార్థిని స్నేహితుడితో గొడవ పెట్టుకున్న బస్ కండక్టర్ ఆ అమ్మాయిని నలబై అయిదు నిముషాలపాటు సిటీబస్‌లో నిర్బంధించాడు. ఆమె పెద్దగా అరచి ఏడ్చినా సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు సైతం ఆమెకు అండగా నిలబడలేదు. చివరికి ఆమె ఫేస్‌బుక్‌లో తన బాధని పంచుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే-
స్మృతి (పేరు మార్చారు) తన ఫేస్ బుక్ పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం- ఆమె సృష్టి ఆర్ట్స్ కాలేజిలో చదువుతోంది. బుధవారంరాత్రి కాలేజి అయిపోయాక ఇంటికి వెళ్లడానికి తన స్నేహితుడితో కలిసి సిటీబస్ ఎక్కింది. అది బెంగలూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్.
స్మృతి బాయ్ ఫ్రెండ్ లేడీస్ సెక్షన్లో ఆమె పక్కన నిలబడటంతో గొడవ మొదలైంది. అక్కడ నిలబడకూడదని కండక్టర్ ఉమాశంకర్ చెప్పాడు. దాంతో అతను వెళ్లి బస్ ఫుట్‌పాత్ మెట్ల మీద కూర్చున్నాడు. అయినా కండక్టర్ ఆగకుండా అతనితో వివాదానికి దిగాడు. చివరికి గొడవ మరింత పెద్దదై కండక్టర్ అతడిని కిందకు తోసేశాడు. అ యువకుడు ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు చెందినవాడు. అక్కడకు చేరిన జనం తానే ఏదైనా దురాగతం చేశాడని భావిస్తారేమో అని భయపడిన అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో స్మృతి కలిగించుకున్నది చాలా తక్కువ. కానీ కండక్టర్ మాత్రం ఆమె స్నేహితుని వివరాలు చెప్పాలంటూ బస్‌లోనే ఆమెను నిర్బంధించాడు. డ్రైవర్ కూడా అతనికే సపోర్టు చేశాడు.
అలా స్మృతి నలభై అయిదు నిముషాల పాటు యెల్హాంకా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న బస్‌లో ఉండిపోయింది. తన స్నేహితుని వివరాలు చెబితేకానీ దిగనివ్వనంటూ కండక్టర్ బస్‌ని లాక్ చేశాడు. ఆమె అరచింది, ఏడ్చింది అయినా అతను కరగలేదు. అంతకు మించి సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్లోని పోలీసులు సైతం కండక్టర్‌కే వంతపాడారు. ఆమె స్నేహితుని గురించి చెబితేనే కానీ బస్‌ని ఓపెన్ చేయమని చెప్పేశారు. దాంతో స్మృతి తన ఇతర స్నేహితులకు కాల్ చేసింది. వారంతా వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో కండక్టర్ ఆమెను వదిలేశాడు.
అయితే స్మృతిని పోలీసులు రక్షించకపోగా కేసు పెట్టడానికి వెళితే ఆమెకు తమ సహకారం అందించలేదు. యెల్హాంకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, కేసు పెట్టినా అది ఐదారేళ్లు నడుస్తుంది…అంటూ ఆమెను నిరుత్సాహ పరచాడు.
అయితే ఆమె ఈ ఉదంతాన్ని వెంటనే ఫేస్‌బుక్‌లో బయటపెట్టింది. అది వైరల్ అయిపోయింది. దాంతో పోలీస్ అధికారులు స్పందించారు. స్మృతి కేసు పెట్టకపోయినా ఫేస్‌బుక్ పోస్టింగునే సుమోటుగా తీసుకుని కేసు నమోదు చేశారు. గురువారం కండక్టర్‌ని అరెస్టు చేశారు. డిప్యుటీ పోలీస్ కమిషనర్ స్మృతికి కాల్ చేసి, కేసు పెట్టడం గురించి అడిగారు. పోలీస్ కేసు అంటే తన కుబుంబ సభ్యులు భయపడటంతో తాను వద్దనే నిర్ణయించుకున్నానని, అయితే నిందితుడి విషయంలో చట్టం ఎలాంటి చర్యలు తీసుకొనబోతున్నదో పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుంటానని ఆమె తెలిపింది.
ఒకవైపు పోలీసులు తనకు అండగా నిలవకపోయినా, ఫేస్‌బుక్ పోస్టుకి స్పందించిన అధికారులకు స్మృతి కృతజ్ఞతలు తెలిపింది. అయితే స్మృతిని నిర్బంధించిన కండక్టర్‌తో పాటు ఇక్కడ ఆమెకు సహకారం అందించని రక్షణశాఖ సిబ్బంది సైతం అమ్మాయిలకు రక్షణలేదనే విషయాన్ని మరింతగా కళ్లకు కట్టినట్టుగా చూపించారు.