సీఎం రేవంత్‌ రెడ్డితో నెదర్లాండ్స్‌ రాయబారి భేటీ

2024-11-12 14:55:00.0

రాష్ట్ర భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో నెదర్లాండ్స్‌ రాయబారి మరిసా జెరార్డ్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన జెరార్డ్‌ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్‌ సిటీ (ఫ్యూచర్‌ సిటీ)ని నిర్మిస్తోందని.. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో పలు సంస్థలు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం వివరించారు. తెలంగాణలో నెదర్లాండ్స్‌ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఢిల్లీ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ambassador of the Netherlands,Marisa Gerard,CM Revanth Reddy,Met in Delhi