https://www.teluguglobal.com/h-upload/2023/07/22/500x300_798679-chair.webp
2023-07-22 08:31:37.0
రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించడానికి అంటే… మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి వ్యాయామం సమర్ధవంతంగా పనిచేస్తుంది.
రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించడానికి అంటే… మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి వ్యాయామం సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే బద్దకం వల్లనో, సమయం లేకనో, శరీరం సహకరించకపోవటం వల్లనో చాలామంది వ్యాయామం చేయలేరు. అలాంటివారికోసం ఓ మంచి వ్యాయామాన్ని సూచిస్తున్నారు పరిశోధకులు. తక్కువ శ్రమతోనే చేయగల ఈ వ్యాయామంతో రక్తంలో చెక్కర స్థాయి యాభైశాతం వరకు తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని… హవాయికి చెందిన అమెరికన్ ఫిజిషియన్, పోషకాహార నిపుణుడు, రచయిత అయిన డాక్టర్ టెర్రీ షింటానీ తెలిపారు. ఈయన ఈ విషయం గురించి తన ఫేస్ బుక్ పోస్ట్ లో వెల్లడించారు. మధుమేహం ఉండీ బద్దకస్తులైన వారికి ఇది ఎంతో ఉపయోగకరమని టెర్రీ చెబుతున్నారు. ఆయన తెలిపిన వివరాలివి-
గంటల కొద్దీ సమయం కూర్చుని ఉండేవారు తమ కాలి పిక్కలను కదిపే వ్యాయామం చేసినప్పుడు రక్తంలో చెక్కర శాతం తగ్గుతుందని నూతన పరిశోధనలో తేలింది. దీనిని సోలియస్ పుషప్స్ అంటారు. ఈ వ్యాయామం వెన్ను, తుంటి, మోకాళ్ల సమస్యలున్నవారు షుగర్ ని తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాళ్ల పిక్కల భాగంలో కింద ఉండే కండరాన్ని సోలియస్ అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది రక్త ప్రసరణలో భాగమై ఉండే చెక్కరని ఎక్కువగా ఖర్చు చేయగలుగుతుంది. దీనివలన రక్తంలో చెక్కర, ఇన్సులిన్ రెండింటి స్థాయిలు తగ్గుతాయి.
సోలియస్ పుషప్స్ ఎలా చేయాలి?
కుర్చీలో కూర్చుని కాలివేళ్లను నేలకు ఆన్చి కాళ్ల మడమలను పైకి లేపి కిందకు దించుతూ ఉండాలి. ఈ విధంగా లయబద్ధంగా నిముషానికి యాభై సార్ల వరకు చేయవచ్చు. తరువాత కూడా భరించినంత సమయం వరకు ఈ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. సోలియస్ కండరాలు తమలో నిల్వ ఉన్న గ్లైకోజన్ (ఇది గ్లూకోజ్ కి ఒక రూపం. దీనిని మన శరీరం లివర్లో, కండరాల్లో నిల్వ చేసుకుంటుంది) ని శక్తి కోసం వినియోగించుకోలేకపోవటం వలన ఇవి రక్తంలోని గ్లూకోజ్ ని శక్తిగా వినియోగించు కుంటాయి. దాంతో రక్తంలో చెక్కర స్థాయి తగ్గుతుంది. ఈ పుషప్స్ తో కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.
నడక… పుషప్స్ తో ఎంతో లాభం…
డెస్క్ జాబ్ కారణంగా ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ వ్యాయామం చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని డాక్టర్ పలాష సర్దేశాయి అనే ఫిజియోథెరపిస్ట్ తెలిపారు. ఎక్కువ సమయం కూర్చోకుండా తరచుగా నడుస్తూ ఉండటం, సోలియస్ పుషప్స్… ఈ రెండింటి ద్వారా భోజనం తరువాత రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గుతాయని, ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైందని సర్దేశాయి చెప్పారు.
ఇవి సురక్షితమే కానీ…
సాధారణంగా సోలియస్ పుషప్స్ సురక్షితమైనవే. సరిగ్గా చేసినట్లయితే వీటి వలన ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అయితే మోకాళ్లపై బరువులు ఉంచుకుని కూర్చుని సోలియస్ పుషప్స్ చేసినట్లయితే కాలి దిగువ భాగంలో నొప్పి లేదా తీవ్రమైన అసౌకర్యం కలగవచ్చు. ఇలాంటప్పుడు వ్యాయామాన్ని ఆపేసి వైద్యులను సంప్రదించాలి. అలాగే కీళ్ల సమస్యలు, మోకాళ్లు చీలమండల్లో నొప్పులున్నవారు, గర్భవతులు, అప్పుడే వ్యాయామం ప్రారంభిస్తున్నవారు కాలి పిక్కల కండరాలను పెంచే సోలియస్ పుషప్స్ చేసే ముందు వైద్యులను లేదా ఫిట్ నెస్ నిపుణులను సంప్రదించడం మంచిది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు లాంటి సమస్యలున్నవారు కూడా వైద్యులను సంప్రదించే ఈ వ్యాయామం చేయాలి.
ఎక్కువసార్లు చేయవచ్చు…
చేతుల్లోని కండరాలను పెంచే వ్యాయామాలను పదేపదే చేస్తున్నపుడు ఒకే తరహా కదలికల వలన అవి అలసటకు, అసౌకర్యానికి గురయి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నిసార్లు సోలియస్ పుషప్స్ చేసినా ఆ కండరానికి ఎలాంటి అసౌకర్యం ఉండదు. కనుక వీలయినన్ని సార్లు ఈ పుషప్స్ ని చేయవచ్చు.
Sugar Control Tips in Telugu,Health Tips,Exercise,Diabetes Tips in Telugu,Diabetes
sugar, sugar control in telugu, Telugu, telugu health tips, health tips, health news, exercise, Diabetes, Best chair based exercise for Diabetes
https://www.teluguglobal.com//health-life-style/exercise-while-sitting-on-a-chair-reduces-sugar-by-half-telugu-health-tips-949635