సీబీఐ చనిపోయిందని చెప్పిన మహిళ.. కోర్టులో ప్రత్యక్షం

2022-06-05 06:18:27.0

దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఓ కేసులోని ప్రత్యక్ష సాక్షి చనిపోయిందని కోర్టుకు తెలిపింది. కానీ అనూహ్యంగా ఆ సాక్షి కోర్టు ముందు హాజరవడంతో కోర్టు ఆశ్చర్యపోయింది. ఇలాంటి సీన్లు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాము. నిజ జీవితంలో జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేస్తాము. కానీ బీహార్‌లో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. హిందుస్తాన్ అనే హిందీ దినపత్రిక బ్యూరో చీఫ్ రాజ్‌దేవ్ రంజన్‌ను 2017లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి గన్‌తో […]

దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఓ కేసులోని ప్రత్యక్ష సాక్షి చనిపోయిందని కోర్టుకు తెలిపింది. కానీ అనూహ్యంగా ఆ సాక్షి కోర్టు ముందు హాజరవడంతో కోర్టు ఆశ్చర్యపోయింది. ఇలాంటి సీన్లు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాము. నిజ జీవితంలో జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేస్తాము. కానీ బీహార్‌లో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే..

హిందుస్తాన్ అనే హిందీ దినపత్రిక బ్యూరో చీఫ్ రాజ్‌దేవ్ రంజన్‌ను 2017లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి గన్‌తో కాల్చి చంపారు. బీహార్‌లోని సివాన్‌ పట్టణంలో రద్దీగా ఉండే స్టేషన్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. రంజన్ భార్య ఆశా రంజన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జేడీ నాయకులు షాబుద్దీన్, తేజ్ ప్రతావ్ యాదవ్‌లే ఈ హత్యకు కారణమని పేర్కొన్నది. ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించడంతో 2017లో ఆర్జేడీ నాయకుడు షాబుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అలాగే ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా బదామీ దేవి అనే మహిళను పేర్కొన్నారు. అయితే సీబీఐ ఆమె చనిపోయినట్లుగా కోర్టుకు చెప్పింది. ఆ మేరకు ఒక నివేదిక కూడా సమర్పించింది. కాగా, శనివారం (జూన్4) ముజఫర్‌పూర్ న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సందర్భంగా అనూహ్యంగా బదామీ దేవి ప్రత్యక్షం అయ్యింది. తానే ఆనాటి ప్రత్యక్ష సాక్షి.. సీబీఐ చనిపోయిందని పేర్కొన్న మహిళనని కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా తన పాన్, ఆధార్ కార్డు ప్రూఫ్స్‌ను కోర్టుకు సమర్పించింది. దీంతో జడ్జి ఒక్కసారిగా అవాక్కయ్యారు.

న్యాయవాది శరద్ సిన్హా ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ నిర్లక్ష్యాన్ని కోర్టుకు వివరించారు. బదామీ దేవిని కలువకుండానే ఆమె చనిపోయినట్లు సదరు సంస్థ నిర్దారించిందని చెప్పారు. అత్యున్నత దర్యాప్తు సంస్థే ఇలా వ్యవహరించడం ఏంటని, ఇది వారి నిర్లక్ష్యధోరణికి నిదర్శనమని కోర్టుకు విన్నవించారు. దీంతో సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తగిన సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కాగా, ఈ హత్య కేసుతో తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు 2018 మార్చితో అతడి పేరును తొలగించింది.