సీమాంధ్రులు ఈ సారి టీఆర్ఎస్‌కు మద్దతు పలుకుతారా?

2022-06-05 05:38:54.0

తెలంగాణలో మరో ఏడాదిన్నర లోపే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతీ పార్టీ తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలమైన పట్టు సడలలేదు. కానీ అర్బన్ ఏరియాల్లో మాత్రం బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఈ […]

తెలంగాణలో మరో ఏడాదిన్నర లోపే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతీ పార్టీ తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలమైన పట్టు సడలలేదు. కానీ అర్బన్ ఏరియాల్లో మాత్రం బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఈ మధ్య తమ బలాన్ని పెంచుకున్నది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగిన సీట్లనే గెలుచుకున్నది. టీఆర్ఎస్‌కు బల్దియాలో అధికారం చేజారకుండా కాపాడింది సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న డివిజన్లే. ఇక్కడి ఆంధ్రా, రాయలసీమ ఓటర్లు గంపగుత్తగా టీఆర్ఎస్‌కే ఓట్లు వేశారు. దీంతో అధికార టీఆర్ఎస్‌కు చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి. నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఆంధ్ర వలసదారులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్లందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారు. కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కేసీఆర్‌కు మద్దతు పలుకుతారా లేదా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో సీమాంధ్రులు ప్రభావితం చేయగలిగే అసెంబ్లీ స్థానాలు 30 వరకు ఉన్నాయి. ఆ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గితే అక్కడ ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఈ సెగ్మెంట్లలో సీమాంధ్రులు టీఆర్ఎస్‌కే మద్దతు పలికారు. దీంతో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఈజీ అయ్యింది. ఈ 30 నియోజకవర్గాలు ఎక్కువగా జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. బీజేపీ ఆయా ప్రాంతాల్లో బలంగా మారుతున్న నేపథ్యంలో సీమాంధ్రుల ఓట్లు కీలకంగా మారనున్నాయి.

కాగా, ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి ఇక్కడ ఓటు హక్కు ఉన్నా.. తమ సొంత ప్రాంతంపై అభిమానం మాత్రం అలాగే ఉన్నది. ఏపీ అభివృద్దిలో బీజేపీ భాగస్వామ్యం లేదని వారు భావిస్తున్నారు. విభజన అనంతరం ప్రత్యేక హోదా, ప్యాకేజీ, నిధులు రూపంలో ఏ మాత్రం సాయం చేయలేదనే ఆగ్రహం వారిలో ఇంకా తగ్గలేదు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

సీమంధ్రుల్లో న్యూట్రల్‌గా ఉన్న వాళ్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదని అంటున్నారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ రాష్ట్రంలో చేస్తున్న మత రాజకీయాలపై కూడా తెలంగాణవాదులతో పాటు సీమాంధ్రులు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. సీమాంధ్రు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం బీజేపీకి అంత సులభమైన విషయం కాదని రాజకీయవేత్తలు అంటున్నారు. ఏపీ, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కేంద్రంలో ఉన్న బీజేపీనే అనే భావనలో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అంటే సీమాంధ్రుల్లో చెప్పలేనంత కోపం ఉన్నది. విభజనకు ఈ పార్టీనే కారణం, ఏపీని ఏకాకిని చేసింది కాంగ్రెస్ అని వాళ్లు మండిపడుతున్నారు. ఆ ప్రాంతవాసులు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓట్లేసే పరిస్థితే లేదు. సీమాంధ్రుల ఓట్లు పోగొట్టుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం సుముఖంగా లేదు. తెలంగాణలో కొన్ని కీలకమైన సీట్లు గెలవడానికి వారిని ప్రసన్నం చేసుకోక తప్పదు. అందుకే ఏ రోజూ సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలు వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం లేదు.

ఇటీవల కేటీఆర్ పక్క రాష్ట్రంలో రోడ్లు, కరెంట్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ దాని వల్ల తీవ్ర నష్టమే జరుగుతుందని గ్రహించి.. వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. సీమాంధ్రుల ఓట్లు కోల్పోతే జరిగే ప్రమాదం ఏంటో టీఆర్ఎస్‌కు తెలుసు కనుకే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల నాటికి సీమాంధ్రల్లో ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని అధినేత కేసీఆర్ తొలగిస్తారనే ధీమాతో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది.