సైఫ్‌పై దాడి..పోలీసుల అదుపులో నిందితుడు

https://www.teluguglobal.com/h-upload/2025/01/17/1395212-saif-alikhan-suspected-arrested.webp

2025-01-17 07:16:15.0

బాంద్రాలోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి అతడిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్న పోలీసులు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్న విషయం విదితమే. దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రాలోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి అతడిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. దాడి చేయడానికి గల కారణమేమిటన్న కోణంలో విచారిస్తున్నారు.

గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి ఘటన చోటు చేసుకున్నది. సైఫ్‌, అతని కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నిందితుడి ఫొటోను విడుదల చేశారు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద అతను చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత అతను వసాయి-విరార్‌ ప్రాంతాలవైపు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణం చేసినట్లు వారు అనుమానిస్తున్నారు.

మరోవైపు ఈ దాడిలో సైఫ్‌ తీవ్రంగా గాయపడ్డారు. లీలావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను డాక్టర్లు బైటికి తీశారు. ఎడమ చేతికి, మెగ కుడి భాగానికి అయిన గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. సైఫ్‌కు ప్రాణాపాయం లేదని ఆస్పత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నీరజ్‌ఉత్తమాని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారని ఇంకొన్ని రోజులు అక్కడే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Saif Ali Khan,Main suspect arrested,First Visuals Of Accused Revealed,Police Questioning,Out of danger