స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత

2025-02-04 15:47:54.0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై ఇవాళ శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత కోరారు.

బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతుందని, ఇది కేవలం జనాభాను తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు. ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. “2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా 10 సంవత్సరాలలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్నది అంచనా. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా కనిపిస్తుంది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది ?” అని ఆమె ప్రశ్నించారు. తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు

BRS Party,KTR,CM Revanth Reddy,Damodar Raja Narasimha,Telangana govermnet,CS Shanthi kumari,Minister Uttam Kumar Reddy,Damodara Rajanarsimha,Ponnam Prabhakar,Seethakka,MP Mallu Ravi,KCR,MLC Kavitha