స్నేహం

2022-12-08 07:45:59.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/08/430251-sneham.webp

ఒక్క చిన్నమాటతో

వారిద్దరి స్నేహం ముక్కలైంది. మనసుకు ఏ కష్టం వచ్చినా బతుకులో పెను తుఫాను లెదురైనా. ఎన్నో చిక్కులను విప్పిన

ఏండ్ల నాటి దోస్తీ

అంతలోనే అస్తినాస్తిగా మారింది. ఇవాళ హృదయ వర్ణాలన్నీ

ఒక్క వర్షంతో వెలిసిపొయ్యాయి.

కులమతాల గీతలను

చెరిపేసిన స్నేహం

వ్యత్యాసాలను తుడిచేసిన స్నేహం దిగంతాల దాకా వ్యాపించిన

విశ్వ చైతన్యంతో ముడిపడిన స్నేహం ఒక్క క్షణంలో

అగ్నికణంగా మారిపోయింది.

దీపం ఆరిపోతే గాలిని నిందిస్తాము నూనె తగ్గిందేమో చూసుకోం

గాలికి ఎదురొడ్డి నిలిచేదే

నిజమైన స్నేహం

చేయీ చేయీ పట్టుకొని నడిచిన దూరమూ దాన్ని కాపాడలేదు.

ఒకే కంచాన్ని పంచుకొని తిన్న పేదరికమూ గుర్తుకు రాలేదు.

ఏమైందో తెలియదు.

మనశ్శాంతిని

బయట వెతుకలేం కదా!

అలాగే స్నేహాన్ని కూడా

స్నేహానికి వ్యాకరణాలుండవు సమీకరణాల్లో ప్రేమలు పండవు స్నేహం వ్యూహం కాదు అది జీవధాతువుల చిరంతన దాహం

మీ స్నేహమే సత్యం

గ్లాసులో నలకపడితే

నీళ్ళు పారబోసుకుంటామా

మించిపోయిందేమీ లేదు

ఒక్కసారి నవ్వండి

మళ్ళీ ఎక్కండి

హృదయ సంవేదనల పూలబండి

 – డా .ఎన్ . గోపి

Dr N Gopi,Telugu Kavithalu