2025-03-04 04:29:51.0
రోహిత్ శర్మ ఊబకాయంపై కాంగ్రెస్ నేత షమా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలకు గవాస్కర్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఊబకాయంపై కాంగ్రెస్ నేత షమా మొహమ్మద్ చేసిన పోస్టు పెద్ద దుమారమే రేపింది. కేంద్రంలోని అధికార బీజేపీ దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను మందలించింది. షమా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సర్వత్రా వ్యతిరేకత రావడంతో షమా తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ పోస్టు తొలిగించారు. అయితే భారత క్రికెటర్లు సరిగా ఆడకపోతే సద్విమర్శలు చేసే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయంలో రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ నాజూకైన ఆకృతి ఒక్కటే అవసరం లేదని, నాణ్యమైన ఆటతీరు కావాలన్నాడు. స్లిమ్‌గా ఉండేవాళ్లే కావాలనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్లాలని విమర్శకులకు చురకలు అంటించాడు.
బ్యాటింగ్ చేయడం ముఖ్యం. క్రికెట్‌లో రన్స్ చేయడమే కీలకం. ఇతర అంశాలన్నీ తర్వాతే. నేను రన్నింగ్ రేసులో రెండు రౌండ్లు కూడా ఉరకలేను. అదే క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేయమంటే రోజంతా ఆడుతాను. గతంలోనే నేనో మాట చెప్పాను. మీకు నాజూగ్గా ఉండేవాళ్లే కావాలనుకుంటే మీరు (విమర్శకులను ఉద్దేశించి) మోడలింగ్ పోటీలకు వెళ్లండి. అక్కడ మీకు కావాల్సిన మోడల్స్‌ను ఎంపిక చేసుకోండి. అంతేగానీ క్రికెట్‌లో ఇలాంటి విషయాలకు చోటే లేదు. ఆటను ఎంత బాగా ఆడగలరనేదే ముఖ్యం. గతంలో సర్ఫరాజ్ ఖాన్ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. చాలాసార్లు కొందరితో మాటలు పడ్డాడు. కానీ ఓ టెస్టులో భారత్ తరఫు 150+ రన్స్ ఇన్సింగ్స్ ఆడాడు. వరుసగా హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇక అతడితో సమస్య ఏముంటుంది? క్రికెట్‌లో బాడీ సైజ్‌తో అవసరం లేదని భావిస్తాను. ఇక్కడ మానసికంగా ఎంత బలంగా ఉన్నామనేది ముఖ్యమని గవాస్కర్ తెలిపాడు.
Sunil Gavaskar Slams,Shama Mohamed,For Controversial Remarks,On Rohit Sharma,’If You Want Only Slim Guys…’: