2023-01-16 07:30:35.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/16/435467-swagatham.webp
నా భావ వీణను మీటగా
వినిపించే అనురాగ రాగం
నా హృదయ కుటీరం లో
వెలిగే ఆత్మ దీపం
నా అనుభవాల తెరలలో
ఆవిష్కరించిన ఆలోచనలు
నా పరిచయాల ప్రాబల్యం తో
పెరిగే ఆత్మీయ అనుబంధాలు
నేనుగా ఉన్నందుకు గర్వపడే
స్వంత మనుషుల స్నేహం
కవిత్వ పాఠశాలలో ఇంకా
ఓనమాలు దిద్దే విద్యార్థిని
అనుభూతుల పరిమళాలు
పూర్తిగా ఆస్వాదించలేని వాడ్ని
అందరిలో మంచి,మానవత
ఆశించే అమాయకుడిని
లోకంపోకడ తెల్సి, నా ప్రవర్తనను
సరిదిద్దుకునే సామాన్యుడిని
నన్ను నన్నుగా ప్రేమించి ఆదరించే
అమ్మ మనసు లాంటి మనుషులు
నా తప్పుల్ని ఎత్తిచూపి ఒప్పుల్ని
అంతగా పట్టించుకోని శ్రేయోభిలాషులు
నా జీవనయానం లో నాతో పయనించి యాత్రను
సుగంధభరితం చేసిన మహానుభావులెందరో
నా బాధల్లో కన్నీరు తుడిచి
ఆనందంలో అభినందించిన ఆత్మీయులు
నేనేమిటో తెలుసుకోవడానికి
నా గమ్యమేమిటో తెలియడాన్కి
తోడ్పడిన గురువులు, జ్ణానులు
మహిమాన్విత యోగులు ఎందరో
నా జీవిత లక్ష్యాన్ని చేరుకునే బండిలో నాతో పయనించి
నన్నాదరించి ఆదుకున్న
మనసున్న వారు
అందరూ సర్వకాల సర్వావస్థలలో
ఆనందనందనం లో ఉండాలన్నదే నా ఆకాంక్ష
అందరిలో మనిషిని కాకుండా పరమాత్మను దర్శించే మంచి బుద్ధి ప్రసాదించమని స్వామిని వేడుకొంటూ…
శేఖరమంత్రి ప్రభాకర్
(విశాఖపట్నం)
Sekharamantri Prabhakar,Telugu Kavithalu