2024-10-11 10:34:50.0
15న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368204-nayab-singh-saini.webp
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ షైనీకి బీజేపీ అధినాయకత్వం మరో చాన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన షైనీ ఆరు నెలల పరిపాలనతోనే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడంలో క్రియాశీలంగా పని చేశారు. హర్యానాలో బీజేపీ ఓటమి తథ్యమని.. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే అంచనాలను, ఎగ్జిట్ పోల్ సర్వేలకు షాక్ ఇచ్చేలా బీజేపీ గెలుపు కోసం షైనీ కృషి చేశారు. దీంతో మరోసారి ఆయనకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. మంత్రివర్గ కూర్పుపై పార్టీ పెద్దలు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. ఈనెల 15న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆ రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు షురూ చేశారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు పలకడంతో ఆ పార్టీ బలం 51కి పెరిగింది. అధికారం ఖాయమని ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయిన కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే షైనీ నాయకత్వమే మంచిదనే యోచనలో మోదీషా ధ్వయం ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ శాసనసభ పక్షం త్వరలోనే సమావేశమై తమ పక్ష నాయకుడిగా నాయబ్ సింగ్ షైనీని ఎన్నుకుంటుందని, ఆ తర్వాత గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు.
Nayab singh saini,Haryana,Nexs CM. Oath taken on 15th this month,BJP High Command