https://www.teluguglobal.com/h-upload/2023/08/09/500x300_807655-health-gym.webp
2023-08-09 09:27:59.0
హాస్పటల్లో ఉన్నపుడు విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా తప్పుడు అభిప్రాయమని, బెడ్ రెస్ట్ హాని చేస్తుందని మనకు 1940ల నుండే తెలుసునని పరిశోధకులు అంటున్నారు.
హాస్పటల్ అనగానే ఒకరకమైన వాతావరణం మన కళ్లముందు మెదులుతుంది… అనారోగ్యాలున్నవారు బెడ్స్ పైన బాధతో, నీరసంతో, చికిత్స తీసుకుంటూ ఉంటే… వారి ఆత్మీయులు వారి మంచం పక్కన విషాదవదనాలతో కూర్చుని ఉండటం… ఇలాంటి సన్నివేశాలే హాస్పటల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే పేషంట్లు అంటే మంచం పైన పడుకునే ఉండాలనేం లేదని, చికిత్స తీసుకుంటూ హాస్పటల్ లోనే వ్యాయామం చేసిన వారు త్వరగా కోలుకుంటున్నారని ఓ కొత్త పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా పెద్ద వయసువారు హాస్పటల్లో ఉన్నకాలంలో కనీసం రోజుకి 25 నిముషాల పాటు వాకింగ్ చేసినా త్వరగా కోలుకుంటారని, భవిష్యత్తులో తిరిగి హాస్పటల్ లో చేరాల్సిన అవసరం కూడా వారికి రాకపోవచ్చని ఆ అధ్యయనం చెబుతోంది. మరిన్ని వివరాలు.
ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నపుడు లేదా సర్జరీ జరిగినప్పుడు విశ్రాంతిగా మంచంపైన పడుకునే ఉండాలని, అప్పుడే త్వరగా కోలుకుంటారని మనం నమ్ముతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి అవసరమే అయినా మితిమీరిన విశ్రాంతి పేషంట్ పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. దీనివలన పేషంట్ కోలుకునే కాలం పెరుగుతుంది. అలాగే బెడ్ రెస్ట్ మరిన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. 19 వైద్య పరిశోధనలనుండి సేకరించిన గణాంకాలతో పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు. 55నుండి 78 ఏళ్ల వయసున్న 3000 మంది వృద్ధులకు సంబంధించిన డేటాను పరిశీలించారు. వీరంతా తీవ్రమైన అనారోగ్యాలతో లేదా శస్త్రచికిత్స చేయించుకుని ఏడునుండి 42 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో లేదా జనరల్ వార్డులో ఉండి కోలుకున్నవారు. వీరందరిచేత మంచంపైనే శరీరాన్ని సాగదీసే తేలికపాటి వ్యాయామాల నుండి వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాల వరకు భిన్నరకమైన ఎక్సర్ సైజులను చేయించారు.
వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేసిన వృద్ధులు… కోలుకుని ఇంటికి వెళ్లేనాటికి మరింత మెరుగైన ఆరోగ్యంతో ఉండటం పరిశోధకులు గుర్తించారు. అలాగే అసలు వ్యాయామం చేయనివారితో పోల్చినప్పుడు వీరు డిశ్చార్జ్ అయిన తరువాత తిరిగి హాస్పటల్ కి రావాల్సిన రిస్క్ పదిశాతం వరకు తగ్గింది. మరికాస్త శ్రమతో కూడిన వ్యాయామాలు చేసినవారిలో మరింత మెరుగైన ఫలితాలు కనిపించాయి. తీవ్రమైన అనారోగ్యాలతో ఇంటిన్సివ్ కేర్ యూనిట్ లలో చికిత్స తీసుకున్నవారు కూడా ఎర్లీ మొబిలిటీ థెరపీతో… త్వరగా శారీరకంగా చురుగ్గా ఉండటం వలన వేగంగా కోలుకోవటం పరిశోధకులు గుర్తించారు.
హాస్పటల్లో ఉన్నపుడు విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా తప్పుడు అభిప్రాయమని, బెడ్ రెస్ట్ హాని చేస్తుందని మనకు 1940ల నుండే తెలుసునని పరిశోధకులు అంటున్నారు. బెడ్ రెస్ట్ తో కండరాల ద్రవ్యరాశిని, ఎముకల సాంద్రతని కోల్పోతారని చివరికి తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరతారని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువకాలం బెడ్ రెస్ట్ తీసుకోవటం వలన రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గుతాయి. శరీరానికి పుళ్లు పడటం, మలబద్ధకం, మలమూత్రాలపైన నియంత్రణ కోల్పోవటం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. అదే శారీరకంగా చురుగ్గా ఉంటే కండరాలు ఆరోగ్యంగా శక్తిమంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట సంబంధమైన వ్యాధులు రావు. శారీరక చురుకుదనం వలన శరీర ఆరోగ్యమే కాదు మానసికంగా కూడా చురుగ్గా ప్రశాంతంగా ఉంటారు. కనుక అనారోగ్యాలకు తీసుకునే చికిత్సల్లో శారీరక చురుకుదనం వ్యాయామాలు సైతం ప్రధానమైన ఔషధాలేనని గుర్తుంచుకోవాలి.
Exercises,Hospital,Health,Health Tips,Exercises in Hospital
Exercises in Hospital, Hospital, Exercises, health, health tips, health news, telugu, telugu news, telugu global news, latest telugu news, Exercises in Hospital
https://www.teluguglobal.com//health-life-style/exercises-in-hospitals-stepping-stones-to-health-953945