https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385497-allu-arjun-high-court.webp
2024-12-13 08:32:21.0
సోమవారం విచారిస్తామన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అర్జున్ తరఫు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. ‘అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలి కదా’ అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్ దాఖలు చేసి, నెంబర్ అయినా.. కోర్టు సిబ్బంది బిజీగా ఉండటంతో లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్బంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే, పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Allu Arjun arrested,Over woman’s death,Stampede at Pushpa 2 premiere,Quash Petition,Telangnaa High court