హైడ్రా కూల్చివేతలు ఆగవు.. గ్యాప్‌ మాత్రమే వచ్చింది

2024-12-28 10:46:46.0

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్

హైడ్రా కూల్చివేతలు ఆగవని.. కొంత గ్యాప్‌ మాత్రమే వచ్చిందని కమిషనర్‌ రంగనాథ్ అన్నారు. బుద్ధ భవన్‌ లోని హైడ్రా ఆఫీస్‌లో శనివారం వార్షిక నివేదిక రిలీజ్ చేశారు. చెరువులు, వాటర్‌ బాడీస్‌ ఎఫ్‌టీఎల్‌ బౌండరీలు గుర్తించిన తర్వాత మళ్లీ హైడ్రా కూల్చివేతలు ప్రారంభమవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటర్‌ బాడీల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అసలు హైడ్రా నోటీసులే ఇవ్వదని చెప్పారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు అందాయని తెలిపారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. హైడ్రా చర్యలతోనే ప్రజలకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లు, అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందన్నారు. కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. హైడ్రా 8 చెరువులు, 12 పార్కులకు కాపాడిందని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్లు నిర్ణయిస్తున్నామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఎస్‌ఈతో కో ఆర్డినేట్‌ చేసుకుంటూ శాటిలైట్‌ ఇమేజీలు సేకరిస్తున్నామని చెప్పారు. ఏరియల్‌ డ్రోన్‌ ఫొటోలు తీస్తున్నామని, ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్‌ చేసే చర్యలు చేపట్టామన్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న చెరువుల ఫొటోలు సేకరిస్తున్నామని తెలిపారు.

HYDRA,Demolitions,Water Bodies,FTL,Buffer Zone,Ranganath