హైదరాబాదా.. భాగ్యనగరమా.. చరిత్ర ఏం చెబుతోంది?

2022-07-06 20:38:53.0

ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు మార్లు ‘భాగ్యనగరం’ అని సంబోధించారు. బీజేపీ నాయకులు కూడా గత కొన్నాళ్లుగా హైదరాబాద్ పేరును కాకుండా భాగ్యనగరం అనే పిలుస్తున్నారు. మీడియాకు పంపే లెటర్ హెడ్స్‌లో కూడా హైదరాబాద్ అని ఎక్కడా కనిపించదు. విజయ సంకల్ప సభలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును మళ్లీ భాగ్యనగరంగా మారుస్తాము అని చెప్తున్నారు. అసలు ఈ నగరం పేరు హైదరాబాదా? లేదా […]

ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు మార్లు ‘భాగ్యనగరం’ అని సంబోధించారు. బీజేపీ నాయకులు కూడా గత కొన్నాళ్లుగా హైదరాబాద్ పేరును కాకుండా భాగ్యనగరం అనే పిలుస్తున్నారు. మీడియాకు పంపే లెటర్ హెడ్స్‌లో కూడా హైదరాబాద్ అని ఎక్కడా కనిపించదు.

విజయ సంకల్ప సభలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును మళ్లీ భాగ్యనగరంగా మారుస్తాము అని చెప్తున్నారు. అసలు ఈ నగరం పేరు హైదరాబాదా? లేదా భాగ్యనగరమా అని అందరికీ అనుమానం కలుగుతున్నది.

బీదర్ నుంచి దక్కన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బహమనీ సుల్తానుల కిందే హైదరాబాద్ ప్రాంతం ఉండేది. అయితే ఆ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. అలా కుతుబ్ షాలు 1518లో గోల్కొండ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీల పాలన మొదలైంది. పాత రాజధాని గోల్కొండలో జనాభా పెరిగిపోవడంతో కొత్త నగరం హైదరాబాద్‌కు 1591లో పునాది వేశారు. 1687లో గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హస్తగతం చేసుకొని కుతుబ్ షాహీల పాలనను అంతం చేశారు. 1687 నుంచి 1724 వరకు హైదరాబాద్ మొఘలుల పాలన కిందే ఉన్నది. 1724లో మిర్ ఖమరుద్దీన్ ఖాన్.. అసఫ్ జాహీల పాలనను మొదలుపెట్టాడు. ఆయననే అసఫ్ ఝా 1గా పిలుస్తారు. 1798లో నిజాం అలీ ఖాన్ (అసఫ్ ఝా 2) బ్రిటిషర్లతో కలిసి వారి కింద హైదరాబాద్ స్టేట్‌ను పరిపాలించడం మొదలు పెట్టాడు.

సికందర్ ఝా (అసఫ్ ఝా 3) హైదరాబాద్‌కు దూరంగా సికింద్రాబాద్ అనే మరో నగర నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత 1948లో హైదరాబాద్ స్టేట్ భారత రాజ్యంలో విలీనం అయ్యింది. ఈ మొత్తం హైదరాబాద్ ప్రస్థానంలో కుతుబ్ షాహీలు, మొఘలులు, నిజాములు ఏనాడూ భాగ్యనగరం అని సంబోధించలేదు. కుతుబ్ షాహీలు ముస్లింలలోని షియా వర్గానికి చెందిన వాళ్లు. ఈ నగరానికి పునాది వేసినప్పుడు మహ్మద్ ప్రవక్త అల్లుడైన హైదర్ ఏ కర్రార్ పేరు మీద హైదరాబాద్ అని పేరు పెట్టారు. హైదర్ అంటే అరబిక్‌లో సింహం అని అర్థం. సింహాల నగరం అనే పేరుతో హైదరాబాద్ అని పిలిచారు.

అయితే కొన్ని పుస్తకాల్లో స్థానికులు బాగ్‌నగర్ అని పిలిచినట్లు రాసుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో కనుచూపు మేర పూలు, పండ్ల తోటలే ఉండేవి. ఎంతో అందంగా కనిపిస్తుండటంతో.. ఈ నగరాన్ని బాగ్‌నగర్ అని పిలిచినట్లు చెప్తారు. కానీ పరిపాలకులు మాత్రం ఏనాడూ దాన్ని అధికారికంగా ఎక్కడా రాయలేదు. 20వ శతాబ్దం ఆరంభం వరకు అసలు హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచిన దాఖలాలు లేవు. కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఆ పేరును ఉపయోగిస్తున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

భాగమతి పేరు మీద భాగ్యనగరం ఏర్పడిందని.. కుతుబ్ షాతో ఆమె ప్రేమలో పడి మూసీ నదిని దాటి వచ్చి కలుసుకునే వాడనే కథను చెప్తారు. అయితే చరిత్రకారుడు, పరిశోధకుడు మహ్మద్ సఫియుల్లా మాత్రం భాగమతి అనే మహిళే చరిత్రలో లేదని స్పష్టం చేశారు. అదొక కల్పిత పాత్ర అని, మొఘల్ చరిత్రను రాసిన ఫిరిస్తా ఈ పాత్రను సృష్టించాడని చెప్పారు. ఫిరిస్తా అసలు ఏనాడూ గోల్కొండ సామ్రాజ్యాన్ని కానీ, హైదరాబాద్‌ను కానీ సందర్శించలేదని.. కేవలం ఒక కథను సృష్టించాడని చెప్పుకొచ్చారు. ఆయన 1621లోనే చనిపోయినట్లు చెప్తున్నారు.

కుతుబ్‌ల పాలనలో ఉన్న ముస్లిమేతర మహిళలను గురించి కూడా మహ్మద్ సఫియుల్లా చెప్పుకొచ్చారు. ఇబ్రహీం కుతుబ్ షా- 4 విజయనగర సామ్రాజ్యంలో ఆశ్రయం పొందడానికి వెళ్లినప్పుడు.. అక్కడి యువరాణి భగీరథీ బాయ్‌ని వివాహం చేసుకున్నాడు. 1543 నుంచి 1550 వరకు కుతుబ్ షా-4 అక్కడే ఉన్నాడు. ఇక అబ్దుల్లా కుతుబ్ షా (1626 నుంచి 1672) కాలంలో సారమ్మ అనే మహిళ రాణులలో ఒకరిగా ఉన్నారు. కుతుబ్ షాహీల కాలంలో తారామతి, పెమ్మమతి అనే ఇద్దరు వేశ్యలు ఉన్నారు. వీళ్లు తప్ప వారి చరిత్రలో భాగమతి అనే క్యారెక్టర్ లేనే లేదు. భాగమతిని లవ్ చేశాడని చెప్తున్న మహ్మద్ కులీ కుతుబ్ షా-5.. మిర్ షా మిర్ అనే పేష్వా కూతురుని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు.

హైదరాబాద్ నగర చరిత్ర, దీన్ని పాలించిన వారి చరిత్రను పూర్తిగా పరిశీలించినా, అప్పటి నాణేలను, వారి సమాధులను పరిశీలించినా.. ఎక్కడా భాగ్యనగరం అనే పేరు కనపడదు. హైదర్ మహల్ అనే పేరుతో భాగమతిని పిలిచేవారని చాలా మంది చెప్తుంటారు. కానీ దానికి తగిన ఆధారాలు ఏవీ లేవు. ఇక భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి కూడా చాలా మంది ఉటంకిస్తుంటారు. ఈ ఆలయం శతాబ్ధాల పూర్వం నాటిదని, దీని పేరు మీదే భాగ్యనగరం అని పేరొచ్చిందని చెప్తారు. కానీ ఇటీవల ఒక ఆర్టీఐ ద్వారా వివరాలు అడుగగా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ శతాబ్దాల పూర్వమనే విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. ఇది చార్మినార్ పక్కన 1959 తర్వాత మాత్రమే కట్టిన కట్టడం అని చెప్పారు. దీనికి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతులు కూడా లేవని చెప్పుకొచ్చారు.

చారిత్రక ఆధారాలు, కుతుబ్ షాహీ కాలంలోని నాణేలను చూసినా.. చరిత్రకారుల రాతలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఈ నగరం పునాలుదు పడిన నాటి నుంచి హైదరాబాద్ అని పిలిచిన సాక్ష్యాలే కనపడతాయి.

 

Bhagyanagaram,Hyderabad,What does history say?