2022-06-05 03:52:14.0
దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్. కాంగ్రెస్, టీడీపీ హయాంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ది చెందేందుకు బీజం పడింది. ఇక తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరింత వేగంగా అభివృద్దిలోకి దూసుకొని పోయి మెట్రోపాలిటన్ సిటీలా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమం వైపు సరి కొత్త నగరం ఆవిర్భవించింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాత్రమే పోష్ లొకాలిటీలుగా ఉండేవి. కానీ రాన్రానూ.. రాయదుర్గం, గచ్చిబౌలి, కాజాగూడ, మణికొండ కూడా అభివృద్దిలో పోటీ […]
దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్. కాంగ్రెస్, టీడీపీ హయాంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ది చెందేందుకు బీజం పడింది. ఇక తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరింత వేగంగా అభివృద్దిలోకి దూసుకొని పోయి మెట్రోపాలిటన్ సిటీలా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమం వైపు సరి కొత్త నగరం ఆవిర్భవించింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాత్రమే పోష్ లొకాలిటీలుగా ఉండేవి. కానీ రాన్రానూ.. రాయదుర్గం, గచ్చిబౌలి, కాజాగూడ, మణికొండ కూడా అభివృద్దిలో పోటీ పడ్డాయి.
ప్రపంచంలోని అతిపెద్ద ఎంఎన్‌సీలు హైదరాబాద్‌లో కార్యాలయాలు తెరవడానికి ముఖ్యం కారణం ఇక్కడ ఉన్న సౌకర్యాలే. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ వ్యాపారాలు నడిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలతో పాటు ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉన్నాయి. ప్రతీ నిత్యం విదేశాల నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులు నగరానికి వస్తూ పోతుంటారు. పశ్చిమ దేశాల్లో ఉండే సౌకర్యాలు ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అనేక స్టార్ హోటల్స్‌తో పాటు క్లబ్స్, పబ్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాలతో పాటు చుట్టు పక్కల ఏరియాల్లో అంతర్జాతీయ స్థాయి పబ్స్ ఉన్నాయి.
కాగా, పబ్ అనగానే చాలా మందిలో నెగెటివ్ అభిప్రాయం ఉన్నది. అక్కడ అంతా అసాంఘీక కార్యక్రమాలు జరుగుతాయనే అపోహలో ఉన్నారు. పశ్చిమ దేశాల్లో ‘పబ్లిక్ హౌస్’ కి సంక్షిప్త రూపమే ఈ పబ్. అక్కడ లిక్కర్, ఫుడ్‌తో పాటు మ్యూజిక్ కూడా ఉంటుంది. ఎన్నో దేశాల్లో వీకెండ్స్‌లో మాత్రమే కాకుండా వీక్ డేస్‌లో కూడా పబ్స్‌కు వెళ్లే అలవాటు ఉంటుంది. అందుకే మన నగరంలో పదిహేనేళ్ల క్రితం ఒకటీ అరా ఉన్న పబ్స్ సంఖ్య.. గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా స్టార్ హోటల్స్‌కు అనుబంధంగా అనేక పబ్స్ వెలిశాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీ పరిశ్రమకు, సంపన్నులను దృష్టిలో పెట్టుకొనే ఎక్కువగా పబ్స్ ఏర్పాటు చేశారు.
అయితే ఇటీవల నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకం భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. కాలేజీ విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వ్యవహారాలు కూడా చూశాం. ఈ క్రమంలో ఇటీవల ఒకటి రెండు పబ్స్‌లో డ్రగ్స్ బయటపడ్డాయి. తాజాగా ఒక పబ్‌లో పార్టీకి వెళ్లిన బాలికపై యువకులు సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన నివ్వెరపరిచింది. కూకట్‌పల్లిలోని ఒక పబ్‌లో అర్దనగ్న నృత్యాలు కూడా కలకలం రేపాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి పబ్‌లు ఆటంకంగా మారాయని పలువురు అంటున్నారు. గబ్బుపట్టిన పబ్బులను నిషేధించాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలో 100కుపైగా పబ్స్ ఉన్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చింది. ఇవన్నీ నిబంధనల మేరకు నడుస్తున్నాయా? మైనర్లకు పబ్స్‌లో మద్యం సరఫరా చేస్తున్నారా? సమయపాలన పాటిస్తున్నారా? అనే వాటిపై అధికారులు నిఘా పెట్టాల్సి ఉన్నది. కానీ, కొన్ని పబ్స్ నిబంధనలు తుంగలో తొక్కినా.. మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పబ్స్ వద్ద జరిగే నేరాలు మీడియాలో హైలైట్ అవుతుండటంతో మిగిలిన వాటిపై కూడా అనుమానాలు వస్తున్నాయని యజమానులు అంటున్నారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా కొంత మంది పబ్ యజమానులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. తమ దగ్గరికి బడా సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన అధికారులు, విదేశీయులు వస్తుంటారని.. తాము నిబంధనల ప్రకారమే వారికి మద్యం, ఫుడ్ సరఫరా చేస్తామని గచ్చిబౌలికి చెందిన ఒక పబ్ యజమాని అంటున్నారు. కానీ మీడియాలో వస్తున్న వార్తల కారణంగా పబ్ అంటేనే అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా అనే విధంగా ప్రజలు అనుమానిస్తున్నారని అంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో ఇలాంటి సౌకర్యాలు ఉంటేనే విదేశీయులు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
ఏదేమైనా ఇటీవల జరిగిన కొన్ని ఘటనలకు పబ్స్ కారణమయ్యాయన్నది కాదనలేని నిజం. అధికారుల నిర్లక్ష్యమో.. లంచాలకు అలవాటు పడటం వల్లో కొన్ని పబ్స్‌పై నిఘా లేదన్నది కూడా వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలని కోరుతున్నారు.