హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. రాబోయే రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి.!

2022-06-19 21:24:47.0

హైదరాబాద్ సహా తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకు విస్తారంగా వ్యాపించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ అంతటా వ్యాపిస్తాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే బుధవారం కురిసిన వర్షాలకు జంటనగరాలతో పాటు రాష్ట్రంలో పలు […]

హైదరాబాద్ సహా తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకు విస్తారంగా వ్యాపించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ అంతటా వ్యాపిస్తాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే బుధవారం కురిసిన వర్షాలకు జంటనగరాలతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం పడే సమయంలో వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దని హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ తీగలు, చెట్ల కింద ఉండొద్దని చెప్తున్నారు. ఈ రెండు రోజులు నాలాల పక్కన ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది.

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకడంతో రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగంలో 15.9 సెంటీ మీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 15.6 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లా తోటపల్లిలో 13.6 సెంటీమీటర్లు, కందుకూరులో 13.1, అమన్‌గల్‌లో 12.6, వనపర్తిలో 12.5, మీర్కాన్‌పేటలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇక ఏపీలో కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు విస్తరించాయి. దీని వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత కూడా రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు.

 

GHMC warns,Indian Meteorological Department (IMD),monsoon,rain heavily for two days