హై కమిషనర్‌ను విచారణకు రావాలంది.. అందుకే వెనక్కి పిలిపించాం

2024-10-21 13:29:40.0

కెనడాతో దౌత్య సంబంధాలపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్‌

కెనడాలోని ఇండియన్‌ హై కమిషనర్‌ ను విచారణకు రావాలని ఆ దేశం కోరిందని.. అందుకే కెనడా నుంచి ఇండియన్‌ హై కమిషనర్‌ సహా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఒక మీడియా చానెల్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఒక జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు కెనడాతో దౌత్య సంబంధాలపై స్పందించారు. ఆ దేశంలో ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవడం కెనెడాకు ఇబ్బందికరంగా మారినట్టు ఉందని, అదే ఇండియాలో మాత్రం కెనడా దౌత్యవేత్తలు సైన్యం, పోలీసుల సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. తమ దేశం విషయంలో ఒకలా.. ఇండియా విషయంలో మరోలా కెనడా ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. అక్కడి దౌత్యవేత్తలను కెనడా పౌరులు బహిరంగంగా బెదిరింపులకు గురి చేస్తారని, అందుకే కెనడాలోని హైకమిషనర్‌, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా వెనక్కి పిలిపించామన్నారు. భారత్‌ లో కెనడా దౌత్యవేత్తలు అన్నిచోట్లకు స్వేచ్ఛగా వెళ్తూ రక్షణ పరమైన అంశాలపైనా ఆరా తీస్తున్నారని, అలాంటి వారిని నియంత్రించే ప్రయత్నం కూడా కెనడా చేయడం లేదన్నారు. అదే కెనడాలోని భారత హైకమిషనర్‌, దౌత్యవేత్తలపై బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు.

Canada,India,Diplomatic Relations,Indian High Commissioner,Central Minister Jai Shankar