101 ఏళ్ల న్యూరాలజిస్ట్ … నూరేళ్ల ఆయుష్షు రహస్యం చెప్పారు

https://www.teluguglobal.com/h-upload/2023/08/03/500x300_804377-howard-tucker.webp
2023-08-03 08:57:40.0

డాక్టర్ హోవార్డ్ టక్కర్ ఎమ్ డి… ఈయన వయసు 101 సంవత్సరాలు. ఇప్పటీకీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు.

డాక్టర్ హోవార్డ్ టక్కర్ ఎమ్ డి… ఈయన వయసు 101 సంవత్సరాలు. ఇప్పటీకీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అమెరికాకు చెందిన టక్కర్… 98ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్ కి గురయి వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా ఆయన కుంగలేదు… పనిని ఆపలేదు. తను ఇప్పటికీ చురుగ్గా ఆరోగ్యంగా ఉండటానికి మూడు అంశాలు దోహదం చేస్తున్నాయంటున్నారు టక్కర్. తానేమీ సూపర్ ఆహారాలు తీసుకోలేదని, అద్భుతమైన చికిత్సలేమీ పొందలేదని… కేవలం నిరంతరం శారీరకంగా చురుగ్గా ఉండటం, జీవితానికి ఒక అర్థం ఉండేలా చూసుకోవటం, ఆలోచనలను యవ్వనంగా ఉంచుకోవటం…ఈ మూడు అంశాలే తనకు నూరేళ్లకు పైబడిన జీవితాన్నిచ్చాయని ఆయన చెబుతున్నారు. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి ఒక పరిమిత మోతాదులో మార్టనీ అనే రకం ఆల్కహాల్ తీసుకుంటారట టక్కర్. ఇక సుదీర్ఘ ఆయుష్షు కోసం టక్కర్ చెప్పిన సూత్రాలను మరింత వివరంగా తెలుసుకుందాం..

అర్థవంతమైన పని..

టక్కర్ ఇప్పటికీ చురుగ్గా తన కెరీర్ ని కొనసాగించడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. సుదీర్ఘమైన జీవితకాలానికి రిటైర్ మెంట్ శత్రువువంటిదంటారాయన. 2021లో జరిగిన ఒక అధ్యయనంలో రిటైర్ కాకుండా పనిచేస్తునే ఉన్నవారిలో కంటే రిటైరయి ఊరికే ఖాళీగా ఉంటున్నవారిలో మెదడు క్షీణత ఎక్కువగా ఉన్నదని పరిశోధకులు గుర్తించారు. అయితే తప్పనిసరిగా ఫుల్ టైమ్ జాబే చేయాలని లేదని, ఏదో ఒక అర్థవంతమైన పనిలో ఉండాలని టక్కర్ చెబుతున్నారు. మనం ఎందుకు జీవిస్తున్నాం…? అనే ప్రశ్నని వదులుకోవద్దంటున్నారు ఆయన. ఒకవేళ ఉద్యోగం నుండి విరమణ పొందినా స్వచ్ఛంద సేవకులుగా ఏదైనా పనిలో కొనసాగాలని ఆయన సూచిస్తున్నారు. కొత్త అభిరుచులను ఏర్పరచుకోవటం, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటం లాంటివి చేస్తుండాలి. పని చేస్తూ ఉండటం, దానిని ఆస్వాదించడం ఇవే దీర్ఘాయుష్షు రహస్యాలని టక్కర్ వెల్లడించారు.

ఇప్పటికీ వ్యాయామం…

‘నేను ఇప్పటికీ వ్యాయామం చేస్తూనే ఉన్నాను’ అంటున్నారు టక్కర్. ఇంతకుముందు ఆయన బయట రన్నింగ్ చేసేవారు కానీ ఇప్పుడు ట్రెడ్ మిల్ వ్యాయామం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు రెండునుండి మూడు మైళ్లు ట్రెడ్ మిల్ పైన నడుస్తున్నారు. శారీరక చురుకుదనానికి, సుదీర్ఘజీవితకాలానికి మధ్య సంబంధం ఉన్నదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. గత ఏడాది నాలుగు లక్షలమంది పెద్ద వయసువారిపైన నిర్వహించిన ఓ అధ్యయనంలో కనీసం రోజుకి పదినిముషాలు వేగంగా నడిచినవారిలో నడివయసుకల్లా వారి ఆరోగ్యస్థితి అసలు వయసుకంటే పదహారేళ్లు తక్కువ వయసులో ఉన్నట్టుగా ఉండటం పరిశోధకులు గుర్తించారు. బరువులెత్తటం. మెట్లెక్కడం, సైక్లింగ్, నాట్యం వంటి కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలతో మరణ ప్రమాదం పది నుండి పదిహేడు శాతం వరకు తగ్గుతుంది.

ఆలోచనల్లో వృద్ధాప్యం వద్దు

చాలామంది నడివయసునుండే వృద్ధాప్యం గురించి మాట్లాడుతుంటారు. కానీ అలా ఆలోచించకూడదంటున్నారు టక్కర్. తనకు ఎంతోమంది స్నేహితులు ఉండేవారని, వారంతా ఎప్పుడూ పెరుగుతున్న వయసు గురించి మాట్లాడేవారని, వారంతా ఇప్పుడు లేరని, త్వరగా మరణించారని ఆయన తెలిపారు. ‘నేను ఈ భూమ్మీద ఎప్పటికీ ఉండిపోతానని అనుకుంటాను.. అది నిజం కాదని తెలుసు… అయినా సరే నేను మరణం గురించి ఆలోచించను, భయపడను’ అని చెప్పారు టక్కర్. మరొక అధ్యయనంకూడా టక్కర్ ఆలోచనలు వాస్తవమేనని అంటోంది. 59నుండి 84 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఎవరైతే తాము చిన్న వయసులోనే ఉన్నామని భావిస్తుంటారో వారి మెదడు ఆకృతి చిన్న వయసువారి మెదడులా ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు.

మాలాంటివాళ్లం ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలతో ఉంటామని దీనివలన ఆశావహ దృక్పథం ఏర్పడుతుందని టక్కర్ తెలిపారు. నేను నా కంటే తక్కువ వయసున్నవారితోనే స్నేహం చేస్తాను… నా స్నేహితులలో డెభై, ఎనభై ఏళ్ల వయసున్నవారే ఎక్కువమంది ఉన్నారని టక్కర్ అన్నారు.

Dr Howard Tucker,Neurologist,Longevity,Health Tips
Dr Howard Tucker, Neurologist, Longevity, Guinness Book of World Records, 100-year-old Neurologist Dr. Howard Tucker, Health tips, healh news, telugu global news, latest telugu news, డాక్టర్ హోవార్డ్ టక్కర్

https://www.teluguglobal.com//health-life-style/100-year-old-neurologist-dr-howard-tucker-gives-us-his-secrets-to-longevity-952336