147 బంతుల్లో 300 పరుగులు.. హైదరాబాదీ క్రికెటర్ సరికొత్త రికార్డు!

https://www.teluguglobal.com/h-upload/2024/01/28/1292346-tanmay-agarwal.webp

2024-01-28 05:57:06.0

హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

 

హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెరుపు వేగంతో ట్రిపుల్ సెంచరీ బాదిన మొనగాడిగా నిలిచాడు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ అడపాదడపా సరికొత్త రికార్డులు నెలకొల్పడం సాధారణ విషయమే. అయితే..హైదరాబాదీ యువబ్యాటర్ తన్మయ్ అగర్వాల్ మాత్రం మరెవ్వరికీ సాధ్యంకానీ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ను మించిన తన్మయ్…

2024 సీజన్ రంజీట్రోఫీ ప్లేట్ గ్రూపు మ్యాచ్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన పోరులో తన్మయ్ కేవలం 147 బంతుల్లోనే త్రిశతకాన్ని పూర్తి చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

2017 సీజన్లో ఈస్టర్న్ ప్రావిన్స్ జట్టుతో జరిగిన పోటీలో బోర్డర్డ్ జట్టు సభ్యుడిగా బ్యాటింగ్ కు దిగిన మార్కో మారియాస్ 191 బంతుల్లో సాధించిన అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును తన్మయ్ 147 బంతుల్లోనే సాధించడం ద్వారా తెరమరుగు చేసి..సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గతంలో 2009 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన టెస్టుమ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన 284 పరుగుల రికార్డును సైతం తన్మయ్ అధిగమించగలిగాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఒక్కరోజు ఆటలో 300 పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ పేరుతోనే ఉంది.

సిక్సర్ల బాదుడులోనూ తన్మయ్ రికార్డు…..

తన్మయ్ త్రిశతకంలో 21 సిక్సర్లు, 33 ఫోర్లు ఉన్నాయి. తన్మయ్ వీరబాదుడు బ్యాటింగ్ తో హైదరాబాద్ కేవలం 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

ఈ క్రమంలో ఓ రంజీ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డును సైతం తన్మయ్ సొంతం చేసుకోగలిగాడు. ఇప్పటి వరకూ ఇషాన్ కిషన్ పేరుతో ఉన్న 14 సిక్సర్ల రికార్డును తన్మయ్ 21 సిక్సర్లతో తిరగరాశాడు.

కెప్టెన్ రాహుల్ సింగ్ తో కలసి తన్మయ్ మొదటి వికెట్ కు 402 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ సింగ్ 105 బంతుల్లోనే 185 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో హైదరాబాద్ తొలి వికెట్ నష్టపోయింది.

ఒక్కరోజు ఆటలో అరుణాచల్ ప్రదేశ్, హైదరాబాద్ బ్యాటర్లు కలసి 721 పరుగులు సాధించడం కూడా మరో అరుదైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డుగా మిగిలిపోనుంది.