2024-12-14 06:22:31.0
129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం
https://www.teluguglobal.com/h-upload/2024/12/14/1385744-one-nation-one-election.webp
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. కాగా ఈ నెల 16న లోక్ సభ ముందుకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు రానున్నట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే కీలక ప్రణాళిక అమలు దిశగా ముందడుగు వేసింది.
మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధించడానికి, చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో సహా రెండు ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండు బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా.. మరొకటి సాధారణ బిల్లు. మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని (పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశ్మీర్) అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించడానికి సాధారణ బిల్లును తీసుకొస్తున్నారు. క్యాబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పట్టుబడట్టడంతో ఇవి ఆమోదం పొందాయని అధికారికవర్గాలు వెల్లడించాయి.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీనికోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని కేంద్రం ప్రస్తుతం పక్కనపెట్టింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలుపాల్సిన అవసరం లేదని సంబంధితవర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలనూ వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది.
అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల మద్దతు కావాలి. ఎన్డీకు అంత బలం లేదు. దీంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధ్యమౌతుందా అనేది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తేలిపోతుంది. 542 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీకు 293 మంది మద్దతు ఉన్నది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నది.
‘One nation,one election’,B ills to be introduced,Lok Sabha,On December 16,Union Cabine,129th Amendment NDA,INDIA Bloc,Union Law Minister Meghwal