https://www.teluguglobal.com/h-upload/2023/05/22/500x300_768197-2-thousand-notes.webp
2023-05-22 07:34:22.0
2వేల నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. 50వేలకంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సిందేనన్నారు.
వెయ్యి అనుమానాలు, 2వేల ప్రశ్నలు.. 2వేల నోట్ల ఉపసంహరణపై ప్రజల్లో ఉన్న అపోహల్ని తాజాగా తొలగించే ప్రయత్నం చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ సందర్భంగా వెయ్యినోట్ల ప్రవేశంపై వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఆర్బీఐ అలాంటి ఆలోచన చేయట్లేదన్నారు. అంటే 2వేల నోటు ఉపసంహరణ తర్వాత భారత కరెన్సీలో రూ.500 నోటు మాత్రమే అతి పెద్దది అని చెప్పుకోవాలి.
డిపాజిటర్లు నిబంధనలు పాటించాల్సిందే..
2వేల నోట్లు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. 50వేలకంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సిందేనన్నారు. గతంలో కూడా ఈ నిబంధన ఉందని, 2వేల నోట్ల డిపాజిట్ కి మినహాయింపేమీ లేదన్నారు. అయితే నగదు మార్పిడి విషయంలో ఐడీ వద్దు, ఫారం నింపొద్దు అంటూ ఎస్బీఐ ఇచ్చిన మినహాయింపుపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేవలం డిపాజిట్ల విషయంలోనే ఆయన స్పష్టత ఇచ్చారు.
నగదు నిర్వహణలో భాగంగానే 2వేల నోట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్ లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్ లను విడుదల చేస్తుందని, ఇది కూడా అలాంటిదేనన్నారు. సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు 2వేల నోట్లు ఖజానాకు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని, నాలుగు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకొని నోట్లన్నీ వాపస్ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని తెలిపారు. కొందరు వ్యాపారులు 2వేల నోట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంలేదనే విషయం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు.
ముందు జాగ్రత్తలు..
గతంలో పెద్దనోట్ల రద్దు సమయంలో చాలామంది బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు, ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి అవస్థలు లేకుండా బ్యాంకుల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉపదేశించింది. నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ కూడా సూచించింది. అవసరమైన చోట షామియానాలు వేసి, నీళ్లు అందుబాటులో ఉంచాలని, వేసవి నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. బ్యాంకుల్లోని కౌంటర్లన్నింటిలో నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.
2 thousand notes,indian currency,Shaktikanta Das,Rs 2000 currency notes,RBI
rbi, shaktikanth das, 2 thousand notes, indian currency,
https://www.teluguglobal.com//business/rbi-governor-shaktikanta-das-latest-clarification-on-2-thousand-notes-934501