8-10 నెలల్లో భారత్‌ సొంత ఏఐ మోడల్‌

2025-01-30 08:24:05.0

ఉత్కర్ష్‌ ఒడిశా కాన్‌క్లేవ్‌లో ఈ మేరకు ప్రకటన చేసిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్న వేళ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. రాబోయే కొన్నినెలల్లో భారత్‌ సొంత జనరేటివ్‌ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసుకోబోతున్నదని వెల్లడించారు. ఉత్కర్ష్‌ ఒడిశా కాన్‌క్లేవ్‌లో ఈ మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. భారతదేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ మోడల్‌ను తీర్చిదిద్దనున్నట్లు అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

ఈ ఏఐ మోడల్‌ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్‌ సామర్థ్యంతో రూపొందనున్నదని తెలిపారు. మన దేశంలోని భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతితక్కువ ఖర్చుతో ఈ ఏఐ మోడల్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. దేశీయ అవసరాల కోసం రూపొందించనున్న ఈ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ అభివృద్ధికి సుమారు 19 వేల జీపీయూలు అవసరమౌతాయన్నారు. ఇందులో 15 వేల జీపీయూలు హైఎండ్‌వి అని తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు డెవలపర్లను గుర్తించామని, రాబోయే 8-10 నెలల్లో ఏఐ మోడల్‌ను సిద్ధంచేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదే జరిగితే ఏఐ రంగంలో దూసుకెళ్తున్న అమెరికా, చైనాల సరసన భారత్‌ నిలవనున్నదన్నారు.

IT Minister Ashwini Vaishnaw,Big Announcement,India to Launch,Its Own AI Model,In 8-10 Months