మెట్లెక్కితే… భలే మేలు

https://www.teluguglobal.com/h-upload/2023/10/20/500x300_843760-stair-climbing.webp
2023-10-20 07:28:58.0

చాలామంది మెట్లు ఎక్కాల్సివస్తే వెంటనే లిఫ్ట్ ఉందా… అని వెతుకుతుంటారు. కానీ మెట్లు ఎక్కడం వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే… కాస్త ఆయాసపడుతూ అయినా ఎక్కేస్తారు.

చాలామంది మెట్లు ఎక్కాల్సివస్తే వెంటనే లిఫ్ట్ ఉందా… అని వెతుకుతుంటారు. కానీ మెట్లు ఎక్కడం వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే… కాస్త ఆయాసపడుతూ అయినా ఎక్కేస్తారు.

శారీరక శ్రమలేని ఉద్యోగాలలో ఉండేవారికి ఊబకాయం, మధుమేహం, గుండెవ్యాధులు లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటివారికి వ్యాయామం తప్పనిసరి. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయలేనివారు… కనీసం క్రమం తప్పకుండా మెట్లను ఎక్కినా వ్యాయామం వలన కలిగే లాభాలను పొందవచ్చు.

వాకింగ్ రన్నింగ్ తో పోలిస్తే మెట్లు ఎక్కడం వలన ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మెట్లు ఎక్కడం వలన పొట్టలోని కండరాలన్నింటికీ వ్యాయామం జరుగుతుంది. వెన్నెముక చురుకుదనం పెరుగుతుంది. కాళ్లు, మోకాళ్లు, మడమలు… అనారోగ్యాలు, గాయాలపాలవటం తగ్గుతుంది.

మెట్లు ఎక్కడంతో బరువు తగ్గవచ్చు. ఒక గంటపాటు మెట్లను ఎక్కడాన్ని చాలా తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామంగా చెప్పవచ్చు. దీనివలన ఏరోబిక్ వ్యాయామ ఫలితాలను పొందవచ్చు. ఒక్క మెట్టుని ఎక్కడం వలన 0.17 కేలరీలు, ఒక్క మెట్టుని దిగటం వలన 0.05 కేలరీలు ఖర్చవుతాయి. ఈ లెక్కన రోజుకి అరగంటపాటు మెట్లు ఎక్కి దిగటం వలన తగినంత స్థాయిలో కేలరీలు ఖర్చయి క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

మెట్లు ఎక్కడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. 2000 సంవత్సరంలో ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కడం వలన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె వ్యాధులకు దూరంగా ఉండాలన్నా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.

మెట్లు ఎక్కడం వలన కండరాల శక్తి పెరుగుతుంది. కాళ్లు, తొడలు, తుంటి కండరాలు శక్తిమంతమవడమే కాకుండా పొట్టకండరాలు సైతం బలోపేతం అవుతాయి. కండరాల సాంద్రత పెరుగుతుంది.

శరీరంలో శ్రమని తట్టుకునే శక్తి పెరుగుతుంది. మెట్లెక్కడం వలన నాడీ కండరాలు, గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. శరీరంలో సమతుల్యత పెరిగి తూలిపడటం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఫిట్ నెస్ పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో ఒత్తిడి తగ్గుతుంది.

మెట్లు ఎక్కడం వలన శారీరక ఆరోగ్యమే కాదు… మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సాధారణంగా శారీరక వ్యాయామం వలన శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల అవుతాయి. మెట్లు ఎక్కడం వలన ఈ ప్రయోజనంతో పాటు మంచి నిద్రకూడా పడుతుంది. ప్రతిరోజు మెట్లు ఎక్కే అలవాటు ఉన్నవారిలో శారీరక శక్తి, ఆరోగ్యం మెరుగుపడతాయి. అలాగే బరువు నియంత్రణలో ఉండటం వలన ఆత్మవిశ్వాసం సైతం పెరుగుతుంది.

మెట్లు ఎక్కడం వ్యాయామపరంగా ఎప్పుడైనా చేయవచ్చు. ఖర్చులేని వ్యాయామమిది. అయితే మెట్లు ఎక్కేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవటం, కాళ్లకు హీల్స్ కాకుండా సరైన చెప్పులు, షూలు వేసుకోవటం అవసరం. మోకాళ్ల నొప్పులు ఇతర అనారోగ్యాలేమైనా ఉన్నవారు, పెద్దవయసువారు, గర్భవతులు మాత్రం వైద్యుల సలహా మేరకే మెట్లు ఎక్కడం మంచిది.

Stair Climbing,Health Benefits,Health Tips
Stair Climbing, Health Benefits, Health Tips, Health News, Telugu News, Telugu Global News, Latest Telugu News, stair climbing exercise, ఆరోగ్య లాభాలు, వాకింగ్ రన్నింగ్, ఆరోగ్యం, ఎక్కువ కేలరీలు

https://www.teluguglobal.com//health-life-style/stair-climbing-health-benefits-and-tips-969090