ఈ లక్షణాలుంటే … అధిక కొలెస్ట్రాల్ ముప్పు

https://www.teluguglobal.com/h-upload/2023/06/05/500x300_776379-high-cholesterol.webp
2023-06-05 06:43:54.0

అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ముప్పు అనే విషయం మనందరికీ తెలుసు.

అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ముప్పు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నా ఆ విషయం తెలుసుకోలేకపోవటం వల్ల చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్… ఎక్కువకాలం పాటు అధిక స్థాయిలో ఉంటే గుండెవ్యాధులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతున్నపుడు మన శరీరం నుండి మనకు కొన్ని సంకేతాలు అందుతాయని, వాటిని గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సంకేతాలేమిటో తెలుసుకుందాం.

♦ కొలెస్ట్రాల్ పెరిగింది అనే సూచన మనకు కాళ్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. రక్త ప్రసరణ తగ్గటం కారణంగా కాళ్లకండరాల్లో నొప్పులు, అసౌకర్యం ఉంటాయి. కాళ్లు, తొడలు, పాదాలు, తుంటి భాగాల్లో తరచుగా నొప్పులు వస్తుంటాయి.

♦ పాదాల్లో తిమ్మిర్లు, వణుకు లాంటి లక్షణాలు కనబడతాయి. మొదట్లో చాలామంది ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎక్కువ రోజులు ఇలాంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తమకు అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె వ్యాధులు లేవని నిర్దాంచుకోవటం మంచిది.

♦ కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు అది రక్తనాళాల గోడలకు గారలా పట్టుకుంటుంది. దీనివలన రక్తప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తక్కువైన ప్రాంతంలో చర్మంలో తేడాలు కనబడతాయి. పాదాల చర్మం తీరులో ఏమైనా తేడా ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

♦ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నపుడు చర్మంపైన పసుపు ఆరంజ్ రంగులో బొడిపెల్లాంటివి ఏర్పడతాయి. కళ్ల చివరల్లో, అరచేతుల లైన్లలో, మోకాలి కింద కాలి వెనుక భాగంలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. చర్మపైన ఎక్కడ ఇలాంటి పెరుగుదల కనపడినా వెంటనే డాక్టరు వద్దకు వెళ్లటం మంచిది.

♦ చర్మంపైన దద్దుర్లలా కనబడుతున్నా కొలెస్ట్రల్ స్థాయి లేదా రక్తంలోచెక్కర స్థాయి పెరిగి ఉంటుందని అనుమానించాలి. చేతుల వేళ్ల చివర్లు వాచి ఉన్నా గోళ్లు కిందకు తిరిగి ఉన్నా కొలెస్ట్రాల్ పెరుగుదలకు సూచన కావచ్చు. అలాగే గోళ్లకింద ఎరుపు లేదా పర్పుల్ రంగులో గీతల్లా కనిపించినా, చర్మంపైన మెత్తని మైనపు గడ్డల్లా వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు. ఈ గడ్డలు గుండె లేదా ఇతర అవయవాల్లో పేరుకున్న ప్రొటీన్ కి సంకేతం కావచ్చు. ఇవి ఆయా అవయవాల పనితీరుకి నష్టం కలిగిస్తాయి. చర్మంపైన మరే ఇతర తేడాలు కనిపించినా అవి కొలెస్ట్రాల్ పెరుగుదలకు సూచన కావచ్చు కనుక వైద్యులను సంప్రదించి తగిన సలహాలు చికిత్స పొందటం మంచిది.

High Cholesterol,Cholesterol,Health Tips
High cholesterol, cholesterol, cholesterol Symptoms, High cholesterol Symptoms, High cholesterol causes, causes, Symptoms, Health, Health Tips, Telugu News, Telugu Global News, అధిక కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్, రక్తంలో కొలెస్ట్రాల్, గుండెవ్యాధులు, స్ట్రోక్ ముప్పు

https://www.teluguglobal.com//health-life-style/high-cholesterol-symptoms-and-causes-937786