ఏ రంగు కార్లకు ప్రమాదాలు ఎక్కువ..? ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

2022-10-14 09:52:24.0

సహజంగా ఇలాంటి గణాంకాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసే సరికి అందరికీ దీనిపై క్యూరియాసిటీ పెరిగింది.

ఏ రంగు కార్లు ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంటాయి అనే విషయంపై ఇటీవల ఆసక్తికర గణాంకాలు బయటకొచ్చాయి. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ నివేదిక బయటకు వచ్చింది. దాని ప్రకారం నలుపు రంగు కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయట. ప్రపంచంలో నలుపు రంగు కార్లు 47 శాతం ప్రమాదాలకు గురయ్యే అవకాశముందట. ఆ తర్వాత గ్రే కలర్ కార్లు 11 శాతం ప్రమాదాలకు గురవుతుంటాయట. సిల్వర్ కలర్ కార్లు 10 శాతం, ఎరుపు రంగు కార్లు 7 శాతం ప్రమాదాలకు గురవుతుంటాయని ఆ ట్వీట్ సారాంశం. అంతే కాదు, తక్కువ ప్రమాదాలు జరిగే రంగులు తెలుపు, పసుపు, నారింజ, బంగారు. ఆ రంగు కార్లు అతి తక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

ఆ సంస్థ విశ్వసనీయత ఎంత అనే విషయం పక్కనపెడితే ఆనంద్ మహీంద్రా ఆ ట్వీట్‌ని పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ని పోస్ట్ చేస్తూ.. ఇలాంటి గణాంకాలు సరికాదని చెప్పారు ఆనంద్ మహీంద్రా. తాను వాటిని నమ్మలేనని చెప్పారు. అంతే కాదు.. ఈ తప్పుడు సమాచారం అందరినీ ఆలోచించేలా చేస్తోందని, దీన్ని తాము ఆమోదించలేమని చెప్పారు ఆనంద్ మహీంద్రా.

సహజంగా ఇలాంటి గణాంకాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసేసరికి అందరికీ దీనిపై క్యూరియాసిటీ పెరిగింది. వాస్తవానికి ప్రపంచంలో అమ్ముడయ్యే కార్లలో 50 శాతం కంటే ఎక్కువ తెలుపు రంగు కార్లు ఉంటాయని, మరి నల్ల రంగు కార్లు ప్రమాదాలకు ఎక్కువ గురవుతుంటాయనేది నిజమెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రకరకాల ఇతర నివేదికలతో నెటిజన్లు ఆ పోస్ట్‌కి రిప్లై ఇస్తున్నారు. మొత్తమ్మీద కార్ల రంగు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం.. అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతోంది.