సంయుక్త విజేతలుగా భారత్, దక్షిణాఫ్రికా

2022-06-19 18:44:44.0

భారత్- దక్షిణాఫ్రికా జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాట వర్షం దెబ్బతో కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక ఆఖరి పోరాటం వర్షంతో రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. దీంతో రెండుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత కుర్రాళ్ల పోరాటం… కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ […]

భారత్- దక్షిణాఫ్రికా జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాట వర్షం దెబ్బతో కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక ఆఖరి పోరాటం వర్షంతో రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. దీంతో రెండుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

భారత కుర్రాళ్ల పోరాటం…
కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే….యువఆటగాడు రిషభ్ పంత్ నాయకత్వంలో సిరీస్ సమరానికి సిద్ధమైన భారత యువజట్టు గొప్పపోరాటపటిమను ప్రదర్శించింది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు ఎదురైనా..ఆ తర్వాతి రెండుమ్యాచ్ ల్లో భారతజట్టు పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి భారీవిజయాలతో సమఉజ్జీగా నిలవడమే కాదు..సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.
అయితే…విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ మాత్రం కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగానే ముగిసింది. ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో, వానదెబ్బ తప్పదని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా…నిర్వాహక సంఘం మ్యాచ్ ను ప్రారంభించింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 3.3 ఓవర్లలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, రితురాజ్ గయక్వాడ్ ల నష్టానికి 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత నుంచి కుండపోతగా వానపడడంతో…కేవలం 16 నిముషాల వ్యవధిలోనే మ్యాచ్ ను రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ప్రకటించారు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ భువనేశ్వర్…
సిరీస్ డ్రాగా ముగియడంతో రెండుజట్ల కెప్టెన్లు ట్రోఫీని సంయుక్తంగా అందుకొన్నారు. భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. వర్షం దెబ్బతో మ్యాచ్ రద్దు కావడంతో…టికెట్ల రేటులో 50 శాతం మాత్రమే నష్టపరిహారంగా చెల్లిస్తామని నిర్వాహక కర్ణాటక క్రికెట్ సంఘం ప్రకటించింది. 40 ఓవర్ల మ్యాచ్ చూడటానికి వ్యయప్రయాసలకోర్చి స్టేడియానికి తరలి వచ్చిన అభిమానులు..కేవలం 3.3 ఓవర్ల ఆటకే టికెట్ల ధరలో సగం మొత్తం చెల్లించాల్సి వచ్చింది.

 

టీ-20 సిరీస్,భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్