2022-07-07 06:16:42.0
జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశాన్ని నాగబాబు వాడుకున్నారా..? లేక మోదీ, జగన్ సాన్నిహిత్యం చూసి ఆయన ఈ కౌంటర్ వేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మంటపెట్టింది. వైసీపీ, బీజేపీ అభిమానులు కూడా నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే..? అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ గురించి నాగబాబు కాస్త […]
జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశాన్ని నాగబాబు వాడుకున్నారా..? లేక మోదీ, జగన్ సాన్నిహిత్యం చూసి ఆయన ఈ కౌంటర్ వేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మంటపెట్టింది. వైసీపీ, బీజేపీ అభిమానులు కూడా నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే..?
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ గురించి నాగబాబు కాస్త ఆలస్యంగా ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ లో వ్యంగ్యం పాళ్లు కాస్త ఎక్కువ కావడమే ఇప్పుడు గొడవకు కారణం అయింది.
‘మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పర్ఫామెన్స్ చేశారు, ఆ మహనటులందరికి ఇవే నా అభినందనలు.’ అంటూ ట్వీట్ వేశారు నాగబాబు. చిరంజీవి తప్ప అందర్నీ ఆయన మహా నటులు అనేశారు. జగన్ తో పాటు పనిలో పనిగా మోదీని కూడా టార్గెట్ చేశారు నాగబాబు.
భీమవరం సభకు పవన్ కల్యాణ్ కి ఆహ్వానం లేకపోవడం జనసైనికుల్ని బాధించింది. అయితే బీజేపీతో తెగతెంపులు చేసుకోలేక, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పవన్ కల్యాణ్ ఓ సందేశం విడుదల చేసి సైలెంట్ గా ఉన్నారు. ఆ సభకు పవన్ సోదరుడు చిరంజీవి రావడం, చిరంజీవి, జగన్, మోదీ.. ముగ్గురూ అభిమానంతో పలకరించుకోవడం జనసైనికులకు మరింత ఇబ్బందిగా మారింది. కక్కలేక, మింగలేక అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బీజేపీతో తాము పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నా.. అక్కడ మోదీ జగన్ తో కలసిపోయారు. చిరంజీవి జగన్ మధ్య కరచాలనం, ఆలింగనం కూడా పవన్ కి మింగుడుపడలేదు. ఓవైపు పవన్, జగన్ పై ఎడాపెడా విమర్శలు చేస్తుంటే, మరోవైపు ఆయన సోదరుడు చిరంజీవి మాత్రం జగన్ తో కలసిపోవడం విశేషమే. ఈ సందర్భంలో రేపు జనసేనకు చిరంజీవి మద్దతు తెలుపుతారని, జనసేన తరపున వైసీపీకి వ్యతిరేకంగా చిరంజీవి మాట్లాడతారని అనుకోవడం అసాధ్యం. భీమవరం సభ ఏపీలో బీజేపీ-జనసేన బంధానికి ఓ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే ఆ బంధం బలహీనంగా ఉందని తేలిపోయింది. ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చేసే విధంగా నాగబాబు ట్వీట్ వేశారు. పవన్ కి తెలియకుండా ఆయన మోదీని హేళన చేసేలా మహానటుడంటూ ట్వీట్ వేస్తారని అనుకోలేం. ఒకవేళ అదే నిజమైతే పవన్ కూడా బీజేపీని దూరం పెట్టడానికే సిద్ధమయ్యారని అనుకోవాలి. ఇప్పటికే వైసీపీ, బీజేపీ అభిమానులు నాగబాబు ట్వీట్ పై వైరల్ గా రియాక్ట్ అవుతున్నారు. “వాళ్లంతా స్టేజ్ మీదే నటించారు.. మీ ఫ్యామిలీ అంతా ప్రజారాజ్యం కోసం నటించి కార్యకర్తలు, నాయకుల జీవితాలను పణంగా పెట్టింది” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మిగిలిందల్లా అధికారికంగా బీజేపీ ఈ ట్వీట్ పై స్పందించడమే.
cm jagan,Jana Sena,leader,Naga Babu,PM Modi,Targeting,Tweet