తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

2025-02-06 13:16:47.0

ఎట్టకేలకు జారీ చేసిన పీసీసీ క్రమశిక్షణ సంఘం

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కు పీసీసీ క్రమశిక్షణ సంఘం ఎట్టకేలకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. మల్లన్నకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని బుధవారం మీడియాకు లీకులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రయత్నం మాత్రం చేయలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో వివిధ రకాల కామెంట్స్‌ రావడంతో కాంగ్రెస్‌ పార్టీ స్పందించి గురువారం నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనపై తీన్మార్‌ మల్లన్న చేసిన కామెంట్స్‌, సర్వే ప్రతులను దహనం చేయడంపై పార్టీ క్యాడర్‌ నుంచి తమకు అనేక ఫిర్యాదులు అందాయని నోటీసుల్లో పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ జి. చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్ర పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మానసపుత్రిక అయిన కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రభుత్వం 55 రోజుల వ్యవధిలో కులగణన చేపట్టిందని, దీనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈనెల నాలుగో తేదీన అసెంబ్లీలో కులగణనను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఈ నోటీస్‌ పై ఈనెల 12లోగా కాంగ్రెస్‌ పార్టీ కాన్‌స్టిట్యూషన్‌ ప్రకారం వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

 

Congress Party,Caste Census,Revanth Reddy,BC Population,MLC Teenmar Mallanna,Show Cause Notice,Chinna Reddy