2025-01-30 16:24:04.0
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని ఆమె అన్నారు. ఇవాళ నిజామాబాద్ లో మరో బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది?. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు.
రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దీదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు’’ అని కవిత దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశామని.. దానిని వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఒకప్పుడు నీటితో నిండి కుండలా ఉండి, సిరులు పండించిన నిజామాబాద్ రైతులు.. మళ్ళీ యూరియా కోసం లైన్లు కడుతూ, వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు ఉంటుందో లేదో తెలియని స్థితిలో గోస పడుతున్నారని తెలిపారు.
MLC Kavita,BRS Party,KCR,Nizamabad,Bajireddy Govardhan,Speaker Gaddam Prasad,CM Revanth reddy,Rythu Bharosa,Ration Cards,Indiramma Houses