2025-01-25 10:10:27.0
అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్లు, రేష న్ కార్డుల పంపిణీ రేపే ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో ఈ నాలుగు పథకాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
సీఎంతో సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 26న నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. గ్రామసభలు నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు రాష్ట్రంలో అన్ని మండలాల్లో నాలుగు పథకాలు పూర్తి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయయోగ్యమైన ప్రతి ఏకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు.రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రేపు మండలానికి ఒక గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు నాలుగు పథకాలుప్రారంభిస్తామన్నారు. ఇచ్చిన రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నాలుగు పథకాలు ఇస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేస్తామన్నారు.
CM Revanth Reddy,Review Meeting,On Ration Cards Distribution,INDIRAMMA Housing Scheme