2025-01-08 15:00:55.0
వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇవ్వబోతున్నాం.. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి
తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.రైతుభరోసా కింద రైతులకు ఈనెల 26 నుంచి ఆర్థిక సాయం అందించబోతున్నామని తెలిపారు. గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలకు యేటా రూ.12 వేలు ఇవ్వబోయే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపామన్నారు. ఓల్డ్ సిటీలో నిర్మించిన ఫ్లై ఓవర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు. ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించబోతున్నామని చెప్పారు. రూ.21 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు చెల్లించామన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం : మహేశ్ కుమార్ గౌడ్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలను మొదటి రోజు నుంచే అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ప్రియాంకాగాంధీని ఉద్దేశించి బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయన్నారు.
Congress Party,Telangana,Political Affaires Committee,KC Venugopal,Revanth Reddy,Mahesh Kumar Goud,Rythu Bharosa,Loan Waiver,New Jobs