సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్‌

2024-12-16 06:37:30.0

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని శాసన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డులపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో 89.97 లక్షల తెల్లరేషన్‌కార్డులు, 2.81కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు, కార్డుల్లో మార్పుల కోసం 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడిగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. విధివిధానాలు రూపొందిస్తామంటూ కమిటీ పలుసార్లు భేటీ అయింది.

కానీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఈ కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు..? కొత్త కార్డులు జారీ చేసేదెప్పుడు అని ప్రజల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. పథకాలపై ఆశలు పెట్టుకున్న జనం నిరాశతో నిట్టూరుస్తున్నారు. మరోవైపు హామీలకు, పథకాలకు రేషన్‌కార్డుతో ప్రభుత్వం లింక్‌ పెడుతున్నది. ఎన్నికల సమయంలో ఇవేమీ చెప్పలేదు కదా అని ప్రశ్నిస్తు న్న జనాలు కాంగ్రెస్‌ మోసం చేసిందని మండిపడుతున్నారు. పథకాలను ఎగ్గొట్టేందుకే రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని, ఆరు గ్యారెంటీల అమలు కూడా ఉత్తముచ్చటే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Minister Uttam Kumar Reddy,New Ration cards,Assembly,CM Revanth reddy,Public administration,Minister Ponguleti Srinivas Reddy,Six guarantees