త్రివేణి సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం

2025-02-10 06:16:31.0

మహాకుంభమేళాలో పాల్గొన్నరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402028-president.webp

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.

ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్యస్నానమాచరించి, పూజలు చేశారు.

144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా… భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనున్నది. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 

Maha Kumbh,President Droupadi Murmu,Takes holy dip,In Triveni Sangam