2025-01-28 15:59:49.0
ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై విరుచుకుపడిన రాహుల్‌గాంధీ
https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398413-rahul.webp
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేజ్రీవాల్ తనకు తోచిన విషయాన్ని మాట్లాడుతుంటారు. మొదట్లో ఢిల్లీలో అవినీతిరహిత రాజకీయాలు చేస్తానని చెప్పారు. దేశ రాజధానిలో మార్పులు చూపిస్తానని అన్నారు. కానీ పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం కనిపించకుండా పోతారు. ఢిల్లీలో హింస జరిగే సమయంలో మాయం అయ్యారు. ఆయనకు కొత్తలో చిన్న కారు మాత్రమే ఉండేది. కానీ తర్వాత శీష్ మహల్లో (అద్దాల మేడ) నివసించారు అంటూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని చెప్పి. ఢిల్లీలో భారీ కుంభకోణమే చేశారు. కుంభకోణానికి కేజ్రీవాల్ రూపకల్పన చేశారు. కాబట్టి వాస్తవం బైటికి వచ్చింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం తమ పదవుల నుంచి తప్పుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఆయన నివసించిన శీష్ మహల్‌ను మీరూ చూశారు. కేజ్రీవాల్ అత్యంత విలాసవంతమైన అద్దాల మేడలో నివాసం ఉన్నారు. ఇప్పుడు నిజాలు బైటపడ్డాయి. వారి రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయి అని అన్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికారంలోని ఆప్‌ను గద్దె దింపడానికి ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం ‘సీఎం బంగ్లా’ వివాదం రాజకీ దుమారం రేపుతున్నది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ అంటూ బీజేపీ విమర్శిస్తున్నది. ఈ క్రమంలోనే శీష్ మహల్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ ఆప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Delhi Assembly Elections,AAP,Rahul Gandhi Attacks,Arvind Kejriwal,Highlights Liquor Scam,Sheeshmahal,In Patparganj Rally