2025-01-09 09:03:27.0
విపక్ష ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ఒమర్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు
https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1392948-india-bloc.webp
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విపక్ష ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు తలెత్తడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్షాల ఐక్యతను సీఎం ప్రశ్నించారు. కలిసికట్టుగా లేనందున కూటమి ముగింపు పలకాలంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఏ సమావేశం జరగకపోవడం బాధాకరం. ఇప్పుడు ఈ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారు? దీని అజెండా ఏమిటి? అసలు కూటమి ఎలా ముందుకు సాగుతుంది? ఈ అంశాలపై చర్చలే జరగడం లేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ రాకుండా చేసేందకు శక్తికి మించి కృషి చేసిన ఈ కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు స్పష్టత లేకుండాపోయింది. మనమంతా ఐక్యంగా ఉంటామా? లేదా అనే విషయంపై స్పష్టత లేదని ఒమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ సమావేశం ఏర్పాటునకు సిద్ధం కావాలి. లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడినట్లయితే.. ఇక పొత్తుకు స్వస్తి పలకండి. ఇండియా కూటమని మూసేయండి. అలాకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలంటే కలిసికట్టుగా ఉండాలి. దీనిపై చర్చలు జరిపి ఒక స్పష్టతకు రావాలి అని పిలుపునిచ్చారు.
కాగా.. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్‌లు పొత్తుకు దూరంగా ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ కూటమి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఒమర్ అబ్దుల్లా.. కలిసి ఉండలేకపోతే కూటమిని మూసేస్తే సరిపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
End INDIA bloc,Omar Abdullah,Demands clarity,AAP and Congress,Spar in Delhi