2024-11-24 14:15:54.0
అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనేది వాస్తవమే అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరనేది అందరికీ తెలుసన్న శరద్ పవార్
https://www.teluguglobal.com/h-upload/2024/11/24/1380590-shard-pawar.webp
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి చేదు ఫలితాన్ని మిగిల్చాయి. అధికార మహాయుతి సునామీకి విపక్ష కూటమి దారుణంగా కొట్టుకుపోయింది. ఎంవీఏలోని ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్రవ్యాప్తంగా 10 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, కారణాలు అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఇది ప్రజా తీర్పు. మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం మహాయుతి గెలుపునకు దోహదపడి ఉండొచ్చు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ ఎన్నికల విషయంలో దృఢ విశ్వాసంతో ఉన్నాం. కానీ గెలుపునకు మరింత కష్టపడాల్సింది. అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనేది వాస్తవం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరనేది అందరికీ తెలుసన్నారు. బారామతితో యుగేంద్ర పవార్‌ను నిలబెట్టడం తప్పుడు నిర్ణయం కాదు. ఎవరో ఒకరు పోటీ చేయాల్సిందే కదా? ఇద్దరినీ పోల్చడం సరికాదని శరద్ పవార్ వ్యాఖ్యానించాడు.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి 41 సీట్లు గెలుచుకున్నది. ఎన్సీపీ ఎస్పీ 86 చోట్ల పోటీ చేస్తే 10 సీట్లకే పరిమితమైంది. అయితే ఓట్ల శాతం పరంగా చూస్తే అజిత్ పార్టీ 9.01 శాతం ఓట్లు రాగా.. శరద్ పవార్ ఎన్సీపీకి 11. 28 శాతం ఓట్లు రావడం గమనార్హం. మహాయుతి కూటమిలోని పార్టీల ఓట్లు బదిలీ అయినట్లు మహావికాస్ అఘాడీలో బదిలీ కాలేని ఫలితాలను చూస్తే తెలుస్తుంది.
Sharad Pawar,Breaks silence,Maha Vikas Aghadi drubbing,Maharashtra elections,Mahayuti